Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 8:33 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష

 

. . . లాటరీ విధానం ద్వారా డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారుల ఎంపిక

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇళ్ళను లబ్దిదారులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ తదితరులతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసిల్దార్లు, హౌసింగ్ ఏ.ఈలతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి, ఇప్పటివరకు గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యలు ఏమిటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడతలో ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకురాని వారి మంజూరీలను రద్దు చేసిన చోట, వారి స్థానంలో అర్హులైన కొత్త వారిని లబ్దిదారులుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లోపు పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందిరమ్మ కమిటీలను సంప్రదించి ఆసక్తి కలిగిన అర్హులను గుర్తించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు.

 

Collector conducts lengthy review on progress of Indiramma houses

 

రెండు పడక గదుల ఇళ్ళ స్థితిగతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తైన చోట డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు కోసం లాటరీ విధానం ద్వారా లబ్దిదారులను ఖరారు చేయాలని, వీడియోగ్రపీ మధ్యన జిల్లా అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. కాలమ్స్ దశ వరకు నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు కూడా లబ్దిదారులను లాటరీ ద్వారా ఖరారు చేసి, ప్రజాప్రతినిధులతో పంపిణీ చేయించాలన్నారు. ఇదివరకు నివేశన స్థలాలు పంపిణీ చేసి, ప్రొసీడింగ్ లు అందించిన వారికి ఎక్కడైనా పట్టాలు ఇవ్వకపోతే తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు పలుచోట్ల అటవీ సంబంధిత సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని క్షేత్రస్తాయిలోనే పరిష్కరించాలని తహసిల్దార్లకు మార్గనిర్దేశం చేశారు.  ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నుండి నల్ల మట్టి, చెరువుల నుండి పూడిక మట్టిని వ్యవసాయ అవసరాల కోసం రైతులు ఉచితంగా తరలించుకునేలా అనుమతించాలని తహసీల్దార్లకు సూచించారు. అయితే జిల్లా వరకే తరలించాల్సి ఉంటుందని, ఒకే మార్గంలో వందల కొద్దీ వాహనాలు రాకపోకలు సాగించకుండా నియంత్రించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ పక్కాగా పర్యవేక్షణ జరపాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఎంపీడీఓలు, తహసిల్దార్లను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, హౌసింగ్ పీ.డీ గంగాధర్, ఎ.ఈ నివర్తి తదితరులు పాల్గొన్నారు.