Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 5:58 pm Posted by : ramakrishna

పొగాకు వినియోగ నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం

 

. . . మెడికవర్ హాస్పిటల్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పొగాకు వినియోగ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రశాంత్ ప్రజలకు పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై శనివారం అవగాహన కల్పించారు. పొగాకు వినియోగం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న ప్రధాన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి), క్షయవ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయని తెలిపారు. ధూమపానం చేసే వ్యక్తులు మాత్రమే కాకుండా, వారి చుట్టూ ఉండే కుటుంబ సభ్యులు, చిన్నారులు కూడా పాసివ్ స్మోకింగ్ కారణంగా ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను ఆకర్షణీయంగా ప్రచారం చేసే ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయని డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. ఇటువంటి ప్రలోభాలకు లోను కాకుండా యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పొగాకు అలవాటు నుంచి బయటపడేందుకు దృఢ సంకల్పంతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు, వైద్య నిపుణుల సలహాలు, అవసరమైతే ప్రత్యేక చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. సరైన సమయంలో పొగాకు వినియోగాన్ని మానివేయడం ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ పొగాకు రహిత జీవన విధానాన్ని అవలంబించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలన్నారు.