. స్కూళ్ల పర్మిషన్లు, గుర్తింపులో డిప్యూటీ డీఈవో పాత్ర ఏమిటో..?
. లాగిన్ ప్రొవిజన్ లేకున్నా అన్నీ తానే అవుతున్న ఉప విద్యాధికారి
. రాష్ర్టంలోని ఏ జిల్లాలో లేని నిబంధనల నిజామాబాద్ లో అమలు
నిజామాబాద్, బతుకమ్మ: విద్యా సంవత్సరం ముగింపు వచ్చేసిందంటే కలెక్షన్ ల కాలం మొదలైనట్టే అనే ఆరోపణలకు జిల్లా విద్యాశాఖ అధికారుల వ్యవహారశైలి బలాన్ని చేకూరుస్తోంది. ప్రైవేట్ స్కూళ్లను ప్రారంభించేందుకు అనుమతులు, తాత్కాలిక గుర్తింపు కోసం జిల్లా విద్యాశాఖాధికారితోపాటు మండలాల విద్యాధికారులకు లాగిన్ ప్రొవిజన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా డిప్యూటీ డీఈవోల పాత్ర ఉండదు. అయితే రాష్ర్టంలోని ఏ జిల్లాలో లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో కొత్త నిబంధన అమలవుతోంది. ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన ఫైళ్లు డిప్యూటీ డీఈవో వద్దకు వెళ్లడం, వాటిపై ఆ అధికారి సంతకం చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో అందుకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా స్కూల్ ను సందర్శిస్తారు. సౌకర్యాలు నిబంధనల మేరకు ఉన్నాయా? పాఠశాల నిర్వహణకు అనువైన స్థలం ఉందా వంటి అంశాలను పరిశీలించి డీఈవోకు నివేదిక అందిస్తారు. ఆ తరువాత డీఈవో రీజినల్ జాయింట్ డైరెక్టర్ కు నివేదిక పంపించి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలి. జీవోఎంఎస్ 1 ప్రకారం ఏదైనా స్కూల్ అనుమతి పొందాలంటే ఎంఈవో స్కూల్ ను సందర్శించి ఒరిజినల్ డాక్యుమెంట్ లను సరి చూసి ఓకే అనుకుంటే డీఈవోకు ఫైల్ ను పంపించాలి. కానీ డిప్యూటీ డీఈవోకు ఎలాంటి లాగిన్ ప్రొవిజన్ లేకున్నా ఆ టేబుల్ మీదికి ఫైల్ చేరుతోంది. స్కూల్ అనుమతులకు సంబంధించి ఫైళ్ల పరిశీలన, సంతకాలు చేసేందుకు డిప్యూటీ డీఈవోకు ఎలాంటి అధికారం, అర్హతలు ఉండవు. 2016 అక్టోబర్ లో డిప్యూటీ డీఈవో కార్యాలయాన్ని డీఈవో కార్యాలయంలో విలీనం చేసేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో డిప్యూటీ డీఈవో స్కూళ్ల అనుమతులకు సంబంధించి ఫైళ్లపై సంతకం చేయడం వెనుక కేవలం డబ్బుల వ్యవహ రం మాత్రమే ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి సంబంధం లేకుండా డిప్యూటీ డీఈవో వద్దకు ఫైళ్లు ఎలా చేరుతున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది.