కామారెడ్డి, బతుకమ్మ : పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామన్న సీఎం హామీని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలంలో ఆదివారం మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి పర్యటించారు.వరద బాధిత రైతులతో మాట్లాడి నష్టం జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి తక్షణమే రూ. పదివేల ఆర్థిక సాయం ప్రకటించారన్నారు. నెల రోజులు గడిచిన ఆ నష్ట పరిహారం రైతులకు అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు పంటలకు రైతుబంధు ఇవ్వడంలేదని, రైతులకు యూరియా దొరకడం లేదని దుయ్యబట్టారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామన హామీ సైతం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
