బాన్సువాడ, బతుకమ్మ :
ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్సలు చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బాన్సువాడ నియోజకవర్గంలోని 182 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ. 54.34 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నాయని, మునుముందు మరింత ఉంటాయని అందువలన పల్లెల్లో, తాండాలలో, పట్టణాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచులకు తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యలున్న తక్షణమే అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు.