హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. ఈ నెల 16న తాను రాసిన లేఖలో పేర్కొన్న అంశాలను తాజాగా రాసిన లేఖలో మరోసారి ప్రస్తావించారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఐఆర్‌ఎఫ్‌సీ నిధుల విడుదలలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం, మెట్రో ఫేజ్-2 అమలు తదితర కీలక అంశాలపై చర్చ అవసరమని సీఎం తెలిపారు. జూన్ 22, 23 తేదీలలో తాను న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు కిషన్ రెడ్డికి రాసిన లేఖలో సీఎం వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డి సమక్షంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అత్యంత కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అని సీఎం పేర్కొన్నారు. పెండింగ్ అంశాలు త్వరగా పరిష్కరించేందుకు కేంద్ర మంత్రితో నిర్మాణాత్మక చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలు, ఇతర అవసరమైన పత్రాలను కూడా తీసుకువస్తానని సీఎం తెలిపారు. సమావేశ ఏర్పాటుకు చర్యలు తీసుకుని, వివరాలను త్వరగా తెలియజేయాలని కిషన్ రెడ్డిని కోరారు.
