Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 7:04 pm Posted by : ramakrishna

కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన సీఎం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-1 ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాశారు. ముఖ్యమంత్రి తన లేఖల్లో ఈ ఏడాది జూన్ 23, 24 తేదీల్లో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ఆ సమావేశాల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ నిర్ధారణ, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ అంశాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా ఎస్‌బీఐ క్యాప్స్ ను నియమించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ఎస్‌బీఐ క్యాప్స్‌ కు అప్పగించాల్సిన బాధ్యతలకు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికీ ఖరారు చేయకపోవడం, అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

 

CM writes letters to Union Ministers

 

ఈ ఆలస్యం కారణంగా మెట్రో ఫేజ్-1 స్వాధీన ప్రక్రియలో అనిశ్చితి నెలకొనడంతో పాటు, మెట్రో ఫేజ్-2కు సంబంధించిన డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ కూడా నెమ్మదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యమై, వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయడానికి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇద్దరు కేంద్ర మంత్రులను ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను తక్షణమే అమలు చేస్తే, మెట్రో ఫేజ్-1 స్వాధీన ప్రక్రియతో పాటు మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు సాగుతాయని ముఖ్యమంత్రి తన లేఖల్లో ఆశాభావం వ్యక్తం చేశారు.

 

CM writes letters to Union Ministers