నారాయణపేట, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్తల్–నారాయణపేట–కోడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్‌కెఎల్‌ఐఎస్) పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు బెంగళూరు నుంచి నారాయణపేట జిల్లాలోని మక్తల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి, ముందుగా ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను వీక్షించారు. అనంతరం ప్రాజెక్టు ప్లాన్ మ్యాప్‌లను పరిశీలించి, వివిధ దశల్లో జరుగుతున్న పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తర్వాత మక్తల్ మండలం కత్రేవుపల్లి గ్రామం సమీపంలో కొనసాగుతున్న ఎంఎన్‌కెఎల్‌ఐఎస్ ప్యాకేజీ–1 పనుల ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, అక్కడ నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పంప్ హౌస్ నిర్మాణ పురోగతి, పూర్తయిన పనుల శాతం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. కాంక్రీట్ పనులను తక్షణమే ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, ప్రాజెక్టు పనుల అమలులో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి ఎన్.ఎస్. బోసరాజు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
