మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ర్ట భూభాగంలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ సభ్యులు మంగళవారం కిందికి దించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది అక్టోబర్ 29న బాబ్లీ గేట్లను కిందికి దించుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీకి చేరుకుని నిబంధనల ప్రకారం గేట్లను ఉదయం 11గంటలకు కిందికి దించారు. సాయంత్రం వరకు 14గేట్లు పూర్తిస్థాయిలో గేట్లు మూసుకోనున్నాయి. ఒక వేళ ఎగువ నుంచి భారీ వరద వస్తే మిగులు జలాలను విడుదల చేసేందుకు ఒక గేటు ఎత్తే అవకాశం ఉంది. లేనిపక్షంలో సుప్రీం తీర్పు ప్రకారం మార్చి 1వ తేదీ వరకు బాబ్లీ గేట్లు ఎత్తే అవకాశం లేదు. కార్యక్రమంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ ఈ శ్రీనివాసరావు, నాందెడ్ ఈఈ బన్ సోడ్, సీడబ్ల్యూ సీ ఈ ఈ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ (ఈ ఈ) చక్రపాణి, ఎస్సారెస్పీ (డీఈఈ) గణేశ్, ఎస్సారెస్పీ (ఏఈఈ) రవి, సీడబ్ల్యూసీ సభ్యులు సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.