. . . 20 కిలోల సరుకు స్వాధీనం
కామారెడ్డి, బతుకమ్మ :
రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి రవాణాకు ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. నాగవళ్లి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 20 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు మాత్రం అధికారుల రాకను గమనించి పరారయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ రఘురామ్, కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి బి. హన్మంతరావు ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టారు. సంబల్‌పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగవళ్లి ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 20809)లో కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 57వ బోగీలో ఓ బెర్త్ కింద అనుమానాస్పదంగా ఉన్న రెండు గోనె సంచులను గుర్తించారు. వాటిని పరిశీలించగా 20 ప్యాకెట్లలో ఎండు గంజాయి బయటపడింది. తూకం వేయగా మొత్తం 20 కిలోలుగా తేలింది. గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుల కోసం రైలు మొత్తం గాలింపు చేపట్టారు. కానీ ఎవరూ పట్టుబడలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ట్రైనీ ఎఈఎస్ వి.అశోక్ చంద్ర, డిటిఎఫ్ సీఐ సుందర్ సింగ్, ఎస్‌ఐలు విక్రమ్, శరత్ కుమార్, దీపిక, ట్రైనీ ఎస్సై మధుసూదన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.