Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 6:23 pm Posted by : ramakrishna

కళాశాలల్లో సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

 

. . . జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్ పనులను, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేసి బిల్లులు సబ్మిట్ చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్  అన్నారు. శుక్రవారం ఇంటర్ విద్యా కార్యాలయంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఇతర మరమ్మతులు, ఎలక్ట్రికల్ మరమ్మతులు, అవసరమైన సామాగ్రి కొనుగోలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులు కూర్చునే ఫర్నిచర్ ను మరమ్మతులు చేయించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు ప్రిన్సిపాల్ లకు లెక్చరర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఈ శిక్షణ తరగతులకు అధ్యాపకులకు కేటాయించిన తేదీలలో హాజరయ్యే విధంగా ప్రిన్సిపల్ లు తగిన చర్యలు తీసుకోవాలని ఆయనన్నారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో మరిన్ని అడ్మిషన్లను పెంచేందుకు కళాశాల ప్రిన్సిపల్ లు, అధ్యాపకులు సమన్వయంతో ప్రతి గ్రామంలో ఇంకా 10 వ తరగతి చదివి కళాశాలల లో చేరని విద్యార్థులను గుర్తించి వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాలని ఆదేశించారు. అలాగే విద్యార్థిని, విద్యార్థులకు స్లిప్ టెస్టులతో పాటు నెలవారి పరీక్షలను నిర్వహించి వారి మార్కులను నమోదు చేయాలని, ఫలితాలను విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు విద్యార్థులను గ్రేడుల వారిగా విభజించి ప్రత్యేక శిక్షణను ఇచ్చే విధంగా ఇప్పటినుండి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధ్యాపకుల కొరత ఉన్న కళాశాలల్లో వెంటనే అతిథి అధ్యాపకులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బోధన, బోధనేతర సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

Civil works in colleges must be completed expeditiously.