సన్నవడ్లు తీసుకుని . . . . దొడ్డు బియ్యం అంటగట్టారు
. . . సీఎంఆర్ సప్లయ్ లో 16 రైసుమిల్లులపై కేసులు
. . . ప్రభుత్వానికి 242 కోట్ల నష్టాన్ని మిగిల్చిన మిల్లర్లు
. . . రాష్ట్రంలో 14 మంది మిల్లర్లను అరెస్టు చేసిన సిఐడి
హైదరాబాద్, బతుకమ్మ :
రైసుమిల్లర్లు ఇప్పటి వరకు సీఎంఆర్ ను ఎఫ్ సిఐకి అప్పగించకుండా ఎగవేత అనే ధోరణిని అవలంభిస్తున్న విషయం తెల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు 3500 కోట్ల మేర అప్పుగా తీసుకుని ఎఫ్ సిఐకి అప్పగించాల్సిన సీఎంఆర్ బకాయిలు మిల్లర్ల వద్ద పెండింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీలు చేసినా బియ్యం గింజలు దొరకక వారిపై క్రిమినల్ కేసులు, రెవెన్యూ రికవరి యాక్టు పెట్టిన విషయం తెల్సిందే. తాజాగా మిల్లర్లు ఎఫ్ సిఐకి సరఫరా చేయాల్సిన సన్నబియ్యం స్థానంలో దొడ్డుబియ్యంను పాలిష్ చేసి అప్పగించిన వ్యవహరంను సిఐడి రట్టు చేసింది. విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీల రిపోర్టుల ఆధారంగా ల్యాబ్ లు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్రంలో 16 రైసుమిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రెండు రోజుల వ్యవధిలోని 14 మంది మిల్లర్లను అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున నుంచి నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాలకు చెందిన రైసుమిల్లర్లను అరెస్టు చేయడం కలకలం రేపింది.
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పౌర సరఫరాల శాఖ కేటాయించిన ధాన్యంను మరఆడించి సీఎంఆర్ గా ఎఫ్ సిఐకి అప్పజెప్పాల్సిన బియ్యంను మిల్లర్లు మార్చివేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం ఇచ్చిన సన్నవడ్లను తీసుకుని ఎఫ్ సిఐకి దొడ్డురకం బియ్యాన్ని అంటగట్టినట్లు పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ ఈ నెల 24న ఫిర్యాదు చేయడంతో సిఐడి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో 16 రైసుమిల్లులు దాదాపు 3,385 మెట్రిక్ టన్నుల సన్నబియ్యానికి గాను దొడ్డుబియ్యం(పాలిష్ డ్, రీసైక్లింగ్) ను భారత ఆహార సంస్థకు అప్పజెప్పినట్లు గుర్తించడంతో ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ టీంలు తనిఖీలు నిర్వహించి వాటిని ల్యాబ్ లలో పరీక్షించగా అవి సన్నరకం బియ్యం కాదని రిపోర్టు ఇవ్వడంతో సిఐడి కేసులు నమోదు చేసింది.
2025-26 ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ ప్రభుత్వం 59.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్ సిఐకి అందించే ఉద్దేశ్యంతో పౌర సరఫరాల శాఖ ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. లక్ష్యాన్ని మించి ధాన్యం సేకరణ జరుగడంతో సీఎంఆర్ కోసం రాష్ట్రంలో పలు రైసుమిల్లులకు సన్నరకం వడ్లను కేటాయించారు. 45,414.833 మెట్రిక్ టన్నుల ధాన్యంను మిల్లర్ల నుంచి సేకరించి ఎఫ్ సిఐకి అప్పగించేందుకు నిర్ణయించారు. అయితే ధాన్యంను స్వీకరించిన మిల్లర్లు ఎఫ్ సిఐకి సన్నబియ్యం స్థానంలో దొడ్డురకం బియ్యంను అప్పగించారు. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 242 కోట్ల మేర ఆర్థిక నష్టం సంభవించినట్లు గుర్తించి బియ్యంను ఎఫ్ సిఐకి అప్పగించడాన్ని నిలిపివేశారు. నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాలకు చెందిన 16 రైసుమిల్లులకు సన్నరకం వడ్లను ఖరీఫ్ సీజన్ లో కేటాయించారు. అయితే దానికి బదులుగా దొడ్డురకం బియ్యాన్ని సరఫరా చేయడం వల్ల ప్రభుత్వం ఇచ్చిన బోనస్ రూపంలో మరో రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లింది.

పౌర సరఫరాల శాఖ జనరల్ మేనేజర్ (ఈ ప్రొక్యూర్ మెంట్) ఫిర్యాదు మేరకు సిఐడి మూడు క్రిమినల్ కేసులను నమోదు చేసింది. పౌర సరఫరాల శాఖతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి సీఎంఆర్ నియమనిబంధనలకు విరుద్దంగా, నమ్మక ద్రోహం అక్రమ లాభం కోసం, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే దురుద్దేశ్యంతో 16 రైసుమిల్లులు వ్యవహరించాయని కేసులు నమోదు చేశారు. సివిల్ సప్లయ్ శాఖ సరఫరా చేసిన వడ్లను దారి మళ్లించి, బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం, మోసం చేసే విధంగా సన్నబియ్యం పేరిట పాలిష్ డ్ బియ్యం సరఫరా చేసినట్లు గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో తోలిసారి సిఐడి మిల్లర్ల పై దాడులు నిర్వహించింది. అదివారం తెల్లవారు జామున నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలలో మిల్లులు నిర్వహిస్తున్న నలుగురు మిల్లర్లను అరెస్ట్ చేశారు. ఇద్థరు మిల్లర్లు పరారీ అయినట్లు సిఐడి డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సిఐడి డిఎస్పీ, ఇద్ధరు సిఐలు, ఇద్ధరు ఎస్ఐల టీంకు తోడుగా లోకల్ పోలిసుల అండతో దాడులు జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో కోట్ల రూపాయల సిఎంఆర్ ఎగవేత వేసిన వారిలో ప్రముఖ మిల్లర్లపై నజర్ వేసింది. అందులో భాగంగా పద్మవతి ఆగ్రో ఇండస్ట్రీస్ కు చెందిన లాబిశెట్టి గంగాప్రసాద్, వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమానీ పోట్ల అంజయ్య, శ్రీవాణి ట్రెడింగ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అదినేత బోందుగుల దేవేందర్, మాస్టర్ బిహెచ్ యుడిఐ ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్ కు చెందిన లాబిశేట్టి శ్రీకాంత్ లను తెల్లవారు జామున వారి ఇండ్లలోనే అరెస్టు చేశారు. మరో ఇద్దరు మిల్లర్లు పరారీలో ఉన్నారని సిఐడి అధికారులు తెలిపారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మిల్లర్లను ఉదయం వెళ అరెస్టు చేయడం మిల్లర్లలో అలజడి చెలరెగింది. చాలమంది మిల్లర్లు అరెస్ట్ చేసింది ఎవ్వరో తెలియక లోకల్ పోలిస్ స్టేషన్ లకు పరుగులు తీశారు. కాని వచ్చింది సిఐడి అధికారులను తెలిసి తోకముడిచారు.
