ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా తిర్మాన్ పల్లి గ్రామ సర్పంచ్ చింతల కిషన్ ను నియమించినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నూతనంగా అధ్యక్షులుగా నియామకమైన చింతల కిషన్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో మండల అధ్యక్షులుగా నియమించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. తనని అధ్యక్షులుగా నియమించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా చూడడమే తమ ధ్యేయమన్నారు.మండలంలోని కార్యకర్తలతో కలిసిమెలిసి ఉంటూ ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటానని తెలిపారు. దీనికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల సహకారం ఉండాలన్నారు.నిరంతరం పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమన్నారు. నూతనంగా మండల అధ్యక్షులుగా నియామకమైన నేత చింతల కిషన్ నీ మండలంలోని సీనియర్ నాయకులు,కార్యకర్తలు అభినందించారు.
