. . . భగవద్గీత పఠనంలో ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ సాధించిన అన్నదమ్ములు
కామారెడ్డి, బతుకమ్మ :
భిక్కనూర్ ఎస్.ఐ. ఆంజనేయులు కుమారులు కుశాల్ మనోహర్ యాదవ్, కార్తీక్ మనోహర్ యాదవ్ లు ఆధ్యాత్మిక రంగంలో అద్భుత ప్రగతిని కనబరుస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ‘గీతా పరివార్’ నిర్వహిస్తున్న ఆన్ లైన్ తరగతుల ద్వారా శిక్షణ పొందుతూ, భగవద్గీతలోని 18 అధ్యాయాలలో గల 700 శ్లోకాలను అనర్గళంగా కంఠతా నేర్చుకున్నారు. వీరి అకుంఠిత దీక్షకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన “గీతావ్రతి”గా గుర్తింపు పొందారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన “జ్ఞానస్మృతి” కార్యక్రమంలో తమ ప్రతిభను చాటి “ఎలైట్ వరల్డ్ రికార్డ్” సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్నారు. చిన్నారులు సాధించిన ఈ అరుదైన విజయాలను తెలుసుకున్న జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర గురువారం వారిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎస్పీ సమక్షంలో భగవద్గీత శ్లోకాలను అత్యంత స్పష్టంగా పఠించారు. చిన్నారులు పఠించిన శ్లోకాలను శ్రద్దగా విన్న ఎస్పీ వాటి అర్థాలను అడిగి తెలుసుకోగా, పిల్లలు ఆ శ్లోకాల అంతరార్ధాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. చిన్నారుల ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని చూసి ఎస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. అనంతరం ఎస్పీ చిన్నారులకు స్వీట్లు తినిపించి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశీస్సులు అందజేశారు. చిన్న వయసులోనే ఇలాంటి ఉత్తమ మార్గంలో నడిపిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ చిన్నారులు ఉన్నత స్థాయికి ఎదిగి కన్న తల్లిదండ్రుల పేరుతో పాటు కామారెడ్డి జిల్లా పేరును కూడా దశదిశలా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె నరసింహ రెడ్డి, భిక్నూర్ ఎస్.ఐ. ఆంజనేయులు పాల్గొన్నారు.
