Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 5:08 pm Posted by : ramakrishna

చిన్నారి ప్రాచి హత్య కేసు ఛేదన

 

. . . ఇద్దరు నిందితుల అరెస్ట్

 

ఎడపల్లి, బతుకమ్మ :

 

నిజాంసాగర్ కెనాల్‌లో చిన్నారి మృతదేహం లభ్యమైన దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సీఆర్. నెం.26/2026 కేసులో బీఎన్ ఎస్  సెక్షన్లు 140(1), 103(1), 238 ఆర్/డబ్ల్యూ 49 కింద విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత నెల జనవరి 29న ఎడపల్లి మండలం ఏఆర్‌పీ క్యాంపు శివారులోని డీ-46/8 నిజాంసాగర్ కెనాల్ లో సుమారు ఆరు సంవత్సరాల చిన్నారి మృతదేహం లభ్యమైంది. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫోటోలు ప్రచారం చేయగా, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా కెరూర్ గ్రామానికి చెందిన ప్రాచి కొండమంగలే గా గుర్తించారు. అనంతరం పోలీసు బృందం ముఖేడ్ వెళ్లి మృతురాలు అదే గ్రామానికి చెందినదని నిర్ధారించింది. కెరూర్ గ్రామానికి చెందిన పాండురంగ కొండమంగలే మంగలి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేతో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో అనర్హత వస్తుందనే ఉద్దేశంతో పిల్లలలో ఒకరిని హత్య చేసి తప్పిపోయిందని చెప్పాలని పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో పాండురంగ తన పెద్ద కూతురు ప్రాచీని బైక్‌పై మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి, ఎడపల్లి సమీపంలోని నిజాంసాగర్ కెనాల్‌లో బ్రతికుండగానే తోసివేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పాండురంగ కొండమంగలే, గణేష్ షిండే (కెరూర్ గ్రామ సర్పంచ్) అనే నిందితులను అరెస్ట్ చేసి అపహరణకు ఉపయోగించిన ఎమ్ హెచ్-26-బీవై-7495 నంబర్ బైక్ ని, మూడు మొబైల్ ఫోన్ల ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించినందుకు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, రెంజల్ ఎస్సై కె.చంద్రమోహన్, ఏఎస్సై బాబురావు, పీసీలు సుధీర్, శ్రీకాంత్‌లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

 

Child Prachi murder case solved
Child Prachi murder case solved