Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 4:41 pm Posted by : ramakrishna

బాల్య వివాహాలను అరికట్టాలి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

బాల్య వివాహాలను అరికట్టాలని బాలల పరిరక్షణ జిల్లా అధికారి నాగేల్లి బాబు సూచించారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. 18 సంవత్సరాల వయసు నిండకముందు పెళ్లిలు చేయడంతో సంసార జీవితాన్ని మోయలేక ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందన్నారు. బాలికలకు బలవంతంగా వివాహాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఇవి శారీరక, మానసిక అనర్థాలకు, విద్యావకాశాల కోల్పోవడానికి, లింగ వివక్షకు దారితీస్తాయని పేర్కొన్నారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే 1098 (చైల్డ్ లైన్)కి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్, ఐసిడిఎస్ సూపర్ వైజర్ శ్రీలత, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

Child marriages should be prevented.