Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2025, 1:29 pm Posted by : ramakrishna

గురుకులాల్లో పిల్లలతో వెట్టిచాకిరీ

. ‘ఎక్స్’లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజం

హైదరాబాద్, బతుకమ్మ: సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. స్వీపర్లను, శానిటేషన్ సిబ్బందిని తొలగించి పిలలతో పని చేయిస్తున్నారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కో గురుకులానికి నెలకు రూ.40వేల కేటాయించామని, ఆ నిధులను నలుగురు తాత్కాలిక ఉద్యోగులు టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారికి చెల్లించే వారని తెలిపారు. గతేడాది ఆగస్టు నుండి ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా సిబ్బందిని తొలగించిందని విమర్శించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకుల పాఠశాల వాచ్ మెన్ తో వాటర్ ట్యాంక్ క్లీన్ చేయిస్తుండగా ప్రమాదవశాత్తు అతడు విద్యుత్ షాక్ మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులను ఉద్దేశించి పిల్లలు ఏమైనా గొప్ప బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారా? కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్ రాదు అని ఓ ఐఏఎస్ మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. పిల్లలు సమాజం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారకూడదని హితవు పలికారు. తక్షణమే ఆ అధికారిని తప్పించాలని, ప్రతినెలా గురుకులాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.