Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 6:17 pm Posted by : ramakrishna

పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

 

. . . 9 మంది పేకాట రాయుళ్లు పట్టివేత

 

. . . 4 వాహనాలు, 10 మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా శనివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతెన గ్రామంలో చీతా ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు మంతెన గ్రామంలోని గురుడు కాపు సంఘం భవనంలో కొందరు వ్యక్తులు అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న చీతా ఫోర్స్ బృందం వెంటనే అక్కడికి చేరుకొని ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. పోలీసులు దాడి నిర్వహించిన సమయంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఈ దాడిలో మొత్తం 9 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 10 మొబైల్ ఫోన్లు, 3 కార్లు, 1 మోటార్ సైకిల్, రూ.4,880 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు, మొబైల్ ఫోన్లు, పేకాట రాయుళ్లను తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలు కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు సామాజిక శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇటువంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. అక్రమ పేకాట, జూదం, మద్యం, మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.