- డెయిరీలో పదవీ పూర్తయిన వారికి …
- జీపీలల్లో ప్రత్యేకాధికారులకు…..
- కో-ఆపరేటివ్ చట్టం ప్రకారం చెల్లుబాటేనా..?
- ఏసిడిఆర్ ఉన్నా.. ఫలితం సున్నా
- నిబంధనలు పాటించని ‘విజయ’
హైదరాబాద్, బతుకమ్మ: విజయ డెయిరీలో దాపరికం, దోచుకోవడం జరుగుతున్నట్లు కనబడుతోంది. ప్రధాన కార్యాలయం నుంచి కింది స్థాయి వరకు లాలూచి పడడంతోనే సంస్థ నానాటికి దిగజారిపోతున్నట్లు గమనించవచ్చు. ప్రభుత్వాలు మారుతాయి గాని మేము చేసే పనులు మారవు అన్నట్లుగా అధికారులు ప్రవర్థించడంతోనే డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా తయారవుతోంది. సొసైటి పదవీ కాలం ముగిసినా .. చెక్ పవర్ పాత కార్యవర్గ అద్యక్షులకు ఇవ్వడంతో డెయిరీ పనితీరు ఎలా ఉందో ఊహించవచ్చు.
- చెక్ పవర్ వారికేనట…?
తెలంగాణా రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పాల కేంద్రాలు ఉన్న దగ్గర సోసైటిలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికీ అవే కార్యవర్గాలు చెక్ పవర్ కు బాద్యులుగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. బిల్లులు చెల్లించడం కోసం డెయిరీ మేనేజర్ తో పాటు సొసైటి అధ్యక్షుని సంతకం అవసరం ఉంటుంది. సొసైటి నియమావళి ననుసరించి ఐదేళ్ళు పూర్తి కాగానే వారికి చెక్ పవర్ ఉండకూడదు. డెయిరీ అధికారుల లోపభూయిష్టం వల్ల పదవి కాలం ముగిసినా .. వారి సంతకాలనే వాడుకుంటున్నారు. బాధ్యతారాహిత్యంతో చేసే పనుల వల్ల నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు సందేహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ళు పూర్తి కాగానే సొసైటిలను రెన్యూవల్ చేసి, వెంటనే ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంతవరకు జరగకపోవడానికి కారణాలు తెలియరావడం లేదు.
- కో-ఆపరేటివ్ చట్టం ప్రకారం…
సొసైటిలను కో-ఆపరేటివ్ చట్టాన్ని అనుసరించి ఏర్పాటు చేస్తారు. దీని నిబంధనల ప్రకారం ఐదేళ్ళు కాగానే కార్యవర్గం దిగిపోవాల్సి ఉంటుంది. చేసే పని తప్పని డెయిరీ అధికారులకు తెలిసినా .. అప్పటి అద్యక్షుల చేతికే చెక్ పవర్ అధికారం ఇచ్చారు. కో-ఆపరేటివ్ చట్టాలు కఠినతరంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఇష్టారీతిన వ్యవహరించడం వెనుక మర్మమేమిటో ఉన్నతాదికారులకే తెలుసు. మళ్ళీ కొత్తగా రిజిస్త్రేషన్ చేస్తే రైతులకు, ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లనుంది.
- ఏసిడిఆర్ ఉన్నా…సున్నా ..!
గ్రామాలలో ఉన్న సొసైటీల నిర్వహణను చూసేందుకు ప్రధాన కార్యాలయంలో ఏసిడిఆర్ ను నియమిస్తుంటారు. ప్రత్యేకంగా దీని కోసం ఉన్నప్పటికీ కార్యాచరణాలు నిర్వహించడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సొసైటి రిజిస్ట్రేషన్ తర్వాత ఐదేళ్ళు పూర్తి కాగానే వారి ఆర్థిక లావాదేవిల ప్రకారం రెన్యూవల్ చేయాలి. రైతులకు అన్యాయం జరగకుండా వారి సొసైటీలను ముందస్తుగా రెన్యూవల్ చేయాల్సిన అవసరం ఏసిడిఆర్ పై ఉంది. సొసైటి బాద్యతలను చూసేందుకు ప్రత్యేక ఏసిడిఆర్ ఉన్నా .. లేనట్లుగా ఉందని కేంద్రాల బాద్యులు ఆరోపిస్తున్నారు.
- పాటించని నిబంధనలు..
పాలు, పదార్థాలను ప్రజలకు అందుబాటులో ఉంచి, సంస్థను లాభాల బాట పట్టించాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వ ధిక్కారంగా కార్యకలాపాలు నడిపిస్తూనే, నెల కాగానే జీతాలు పడుతున్నాయా ..లేవా అని చూసుకోవడానికి సరిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులను ఆర్థికంగా పరిపుష్టులను చేద్దామనే ద్యాస ఉన్నతాదికారులలో కనిపించడం లేదని సొసైటి సభ్యులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ పంచాయితీలలో మాదిరిగా పదవీ కాలం మిగిసిన పిదప ఎన్నికలు నిర్వహించడం ఆలస్యమైతే చెక్ పవర్ ను మరో శాఖ అధికారులకు ఇస్తే నిధులు పెడదారిన పట్టకుండా ఉంటాయనే అభిప్రాయాలు రైతుల నుంచి వినబడుతున్నాయి.