Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 6:35 pm Posted by : ramakrishna

ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని యువతి సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం శబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల రామచందర్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఐదు రోజుల క్రితం రామచందర్ చిన్నమ్మ అంజవ్వ మరణించడంతో, ఈ నెల 10న ఉదయం ఆయన భార్య గంగమనితో కలిసి భవానిపేట్ గ్రామానికి దినకర్మకై వెళ్లారు. ఆ సమయంలో పెద్ద కుమార్తె సావిత్రి (19) ఇంట్లోనే ఉండి, ప్రతిరోజులాగే ఉదయం 9 గంటలకు ఎల్లారెడ్డిలోని కంప్యూటర్ క్లాస్‌కు వెళ్లి, మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఇంటికి వచ్చింది. అదే సమయంలో గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మయ్య రామచందర్ ఇంటికి వచ్చి టీవీ చూస్తుండగా, కరెంట్ పోయి మళ్లీ రావడంతో సావిత్రిని టీవీ ఆన్ చేయమని పిలిచాడు. కానీ స్పందన లేకపోవడంతో గదిలోకి వెళ్లి చూసినప్పుడు, సావిత్రి ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకొని మృతిచెందినట్లు గమనించాడు. తరువాత రామచందర్ ఇంటికి చేరుకున్నప్పుడు, బెడ్రూంలో ఒక లాంగ్ నోట్‌బుక్‌లో సావిత్రి వదిలిన రాత కనిపించింది. అందులో శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మార్గపు ప్రదీప్‌తో తనకు ప్రేమ సంబంధం ఉందని, కానీ ఇటీవల ప్రదీప్ తనతో సరిగా మాట్లాడక ప్రేమ పేరుతో మోసం చేశాడని పేర్కొంది. ఈ ఘటనపై తండ్రి రామచందర్ ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.