Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 5:00 pm Posted by : ramakrishna

‘ఛలో హైదరాబాద్’ విజయవంతం చేయాలి

 

. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 15న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని, దీంతో నిరుద్యోగులు సంవత్సరాల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ కోచింగ్ సెంటర్లలో భారీగా ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పలువురు యువకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో సుమారు 20 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ విడుదల చేయడం సరైన చర్య కాదని, దీనిని సవరించి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం యువత సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని, జూలై 15న జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, నగర కమిటీ సభ్యురాలు అనిత, నాయకులు అంజయ్య, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.