. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోని ఆర్టీసీ
. సాధారణ ప్రజలకు ఓ న్యాయం..? ప్రభుత్వరంగ సంస్థకు మరో న్యాయమా..?
హైదరాబాద్, బతుకమ్మ: పది వేలకు పైగా బస్సు సర్వీసులు కలిగి ఉండి తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలలో సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ ఆర్టీసీ ట్రాఫిక్ నిబంధనలను మాత్రం పట్టించుకోవడం లేదు. వేల సంఖ్యలో చలాన్ లు.. లక్షల్లో జరిమానాలు ఉన్నా నామమాత్రంగానైనా చెల్లించడం లేదు. దీంతో సామాన్య ప్రజలకు ఓ న్యాయం, ప్రభుత్వ రంగ సంస్థకు మరో న్యాయమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. – 2024లో 5,790 చలాన్ లకు గాను కేవలం 121 చలాన్ లు సంబంధించి జరిమానాను మాత్రమే సంస్థ చెల్లించింది. ఇంకా రూ.43 లక్షలకుపైగా జరిమానా చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో 232 చలాన్లు రాగా రెండు చలాన్ ల జరిమానా మాత్రమే చెల్లించింది. లక్షా 40వేలకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంది. అలాగే 2019లో ఆర్టీసీ డ్రైవర్లకు రూ.15.23 లక్షల జరిమానా పడగా, మరో రూ.7.03 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి.
సంవత్సరం చలాన్ లు చెల్లించిన చలాన్లు చెల్లించాల్సిన జరిమానా
2024 5,790 121 43,22,790
2025 (జనవరి) 232 02 1,40,000
2023 15,211 7,998 51,60,925
2022 4,376 2,417 14,41,665
పరిశీలిస్తాం
ఇదిలా ఉండగా బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డుభద్రతపై అవగాహన కల్పిస్తున్నామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అంటున్నారు. గతంలోని కొన్ని చలాన్లు చెల్లించామని, మిగతా వాటిని పరిశీలిస్తామని అంటున్నారు. చలాన్లు చెల్లించాలని డ్రైవర్లపై ఒత్తిడి చేస్తున్నారని కొన్ని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థనే ట్రాఫిక్ జరిమానాలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.