నందిపేట, బతుకమ్మ : నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆయన నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నెహ్రూ స్వాతంత్ర్య సమరయోధులు మాత్రమే కాకుండా, స్వతంత్ర భారత నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. నెహ్రూ బాలలపై అపారమైన ప్రేమ చూపించిన వ్యక్తి కనుక దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనను “చాచా నెహ్రూ”గా ప్రేమగా పిలుస్తారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను సాధించడమే నిజమైన నివాళి అవుతుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నేతలు, యువ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.