Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2024, 1:22 pm Posted by : ramakrishna

సెంట్రల్ డిపాజిట్ చేసిన పైసలేవీ..?

. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వకున్నా కాంట్రాక్టర్లు రైల్వే బ్రిడ్జీల పనులు చేస్తున్నరు

. డబ్బులు డైవర్ట్ అయ్యాయని అధికారులు ఒప్పుకున్నరు

. విలేకరుల సమావేశంలో ఎంపీ అర్వింద్

. తెలుసుకుని మాట్లాడాలని పీసీసీ చీఫ్ మహేశ్ కు హితవు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లాలోని రైల్వే ఓవర్ బ్రిడ్జీలకు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం 2021లోనే మొతం డిపాజిట్ చేసిందని, ఆ నిధులు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్ అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జీల పనులపై కలెక్టరేట్ లో మంగళవారం రివ్వ్యూ అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడారు.  దేశంలోని 543 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్క నిజామాబాద్ నియోజకవర్గానికే 7 ఆర్ వోబీలు మంజూరయ్యాయని, ఒకదానికి సంబంధించిన పనులు పూర్తికాగా, నాలుగు వివిధ దశల్లో ఉన్నాయని, బోధన్ లో ఒక ఓవర్ బ్రిడ్జి, మరో అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభమవుతాయన్నారు. రైల్వే బ్రిడ్జీలకు సంబంధించిన అంశంపై తాను ఇప్పటికే చాలా సార్లు మాట్లాడానని, ఆ విషయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు తెలియదేమోనని అన్నారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జీ ఒక్కటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రారంభమైందని, మిగతా బ్రిడ్జీలన్నీ వందశాతం రైల్వేశాఖకు చెందినవేనని తెలిపారు. మాధవనగర్ ఆర్ వో బీ అంచనా రూ.93కోట్లు కాగా, రివైజ్డ్ ఎస్టిమేషన్ రూ.103 కోట్లయ్యిందని, రూ.10కోట్లు రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. 2024 ఏప్రిల్ లో అంచనాలు రూపొందించినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. జూన్ 2025 నాటికి రైల్వే పరిధిలోని పనులు పూర్తవుతాయని, అదే సమయానికి తమ పరిధిలోని పనులను పూర్తి చేస్తామని చెబుతున్న రాష్ర్ట ప్రభుత్వం బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని అర్వింద్ ప్రశ్నించారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ కు సంబంధించిన రూ.10కోట్లు మంజూరు చేయించడంతోపాటు కాంట్రాక్టర్ కు బిల్లులు ఇప్పించాలని మహేశ్ కు సూచించారు.

భూసేకరణ పూర్తి చేయాలి

అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు రూ.135.9 కోట్లతో చేపట్టగా, అందులో 95శాతానికిపైగా కేంద్ర ప్రభుత్వ నిధులేనని ఎంపీ తెలిపారు. షెడ్యుల్ కన్నా ముందే పనులు కొనసాగుతున్నాయని, మూడున్నర ఎకరాల భూ సేకరణ పెండింగ్ ఉందన్నారు. ఆగస్టు నుంచి బిల్లులు ఇవ్వకున్నా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని, రూ.4.5 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాష్ర్ట ప్రభుత్వం స్పందించి భూ సేకరణ పూర్తి చేయించాలని సూచించారు.

ఆర్మూర్ లో పూర్తి

ఆర్మూర్ లో పనులు సెప్టెంబర్ లోనే పూర్తి కాగా, రూ.5కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని, రెండు నెలలవుతున్నా బిల్లులు ఇవ్వడం లేదన్నారు. త్వరగా బిల్లులు క్లియర్ చేయించాలని సూచించారు. ఇవన్నీ మహేశ్ కు తెలియదా? అని ప్రశ్నించారు.

దేశంలోనే కాంప్లికేటెడ్ అడవి మామిడిపల్లి ఆర్వోబీ

అడవి మామిడిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి పనులను రూ.23.7కోట్లతో చేపట్టగా, కాంట్రాక్టర్ కు ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదని అర్వింద్ అన్నారు. అయినప్పటికీ కాంట్రాక్టర్ పనులు చేపడుతున్నారన్నారు. నెల రోజులపాటు ట్రాఫిక్ ను  మళ్లి పనులు పూర్తి చేసి ఇస్తానని కాంట్రాక్టర్ చెబుతున్నాడని, రెండు మూడు రోజుల్లో  ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ ను కోరినట్లు ఎంపీ తెలిపారు.

మహేశ్ తెలుసుకుని మాట్లాడాలి…

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రైల్వే బ్రిడ్జీలపై మాట్లాడటం సంతోషంగా ఉందని, కానీ ఆయన తెలుసుకొని మాట్లాడాలని అర్వింద్ హితవు పలికారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకున్నా వారు పనులు చేపడుతున్న విషయం, మాధవ నగర్ కు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయని విషయం, కేంద్రం మొత్తం నిధులను 2021లోనే రాష్ర్టానికి డిపాజిట్ చేయని విషయం మహేశ్ కు తెలియదా? అని ఎంపీ ప్రశ్నించారు. ఎంపీ పేరు తీసే ముందు ఆలోచించాలని, ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నిక గెలవని మహేశ్ తన పేరు తీసుకోకపోవడమే మంచిదన్నారు.