- వ్యవసాయ కార్మికులను విస్మరిస్తున్న కేంద్రం
- ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.రమేష్
సిరికొండ, బతుకమ్మ : వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని,వ్యవసాయ కార్మికులను కేంద్రం ప్రభుత్వం విస్మరిస్తున్నదని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ విమర్శించారు. బుధవారం సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం( ఏఐపీకేఎంఎస్ ) ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులను పూర్తిగా విస్మరించి వ్యవసాయ కూలీల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వ్యవసాయ కార్మికులకు కార్మికులన్న గుర్తింపు లేదని, కనీస గౌరవం కూడా లేకుండా పోయిందన్నారు. రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులను ఏమాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. ఉపాధి హామీ పని దినాలను కూడా ఉపాధి లేకుండా చేశారన్నారు. కూలి ఉన్న గుర్తిం కార్డు లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు అన్నారు. చేతినిండా పని లేక అన్నమో రామచంద్ర అన్న దుస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న జీవన భృతిని ఇవ్వడం లేదన్నారు.వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వీడకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు అర్ దామోదర్, అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) మండల సహాయ కార్యదర్శి వీ భూమా గౌడ్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం( ఏఐపీకేఎంఎస్ ) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి ఎస్ కిషోర్, జిల్లా, మండల నాయకులు జి బాల్ రెడ్డి , జి ఎర్రన్న, ఎం. మోహన్, తదితరులు పాల్గొన్నారు.
