Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 4:39 pm Posted by : ramakrishna

తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట

 

. . . నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్లు

 

. . . లోక్ సభలో ఎంపీ అర్వింద్ ప్రశ్నకు మంత్రి గడ్కరీ సమాధానం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్ల నివారణ, రహదారి భద్రతా చర్యలకు సంబంధించి తాను లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన సమాధానంలో కీలక వివరాలు వెల్లడయ్యాయని ఆయన తెలిపారు. తెలంగాణలో గత కొన్నేళ్లలో ప్రమాదాల ఆధారంగా మొత్తం 1,513 యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 1,308 బ్లాక్ స్పాట్లకు సంబంధించిన శాశ్వత నివారణ చర్యలు పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఎంపీ తెలిపారు. మరో 205 బ్లాక్ స్పాట్లలో శాశ్వత నివారణ చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు.

. . . నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యత

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 78 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 75 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయని, మరో 3 ప్రాంతాల్లో చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో మొత్తం 107 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, అందులో 99 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయని, మరో 8 ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఎంపీ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమన్నారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి తన వంతు కృషి కొనసాగుతుందని అర్వింద్ తెలిపారు.

. . . ఎన్ హెచ్ – 63, ఎన్ హెచ్ – 61, ఎన్ హెచ్ – 44పై రోడ్డు భద్రతా పనులు

నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని ఎన్ హెచ్ – 63, ఎన్ హెచ్ – 61, ఎన్ హెచ్ – 44 జాతీయ రహదారులపై వంతెనలు, బైపాస్‌లు, రోడ్డు భద్రతా చర్యలతో కూడిన అభివృద్ధి పనులు వివిధ జాతీయ రహదారి అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రణాళిక, అమలు దశల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని అర్వింద్ తెలిపారు.

. . . నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రోడ్డు భద్రతకు కట్టుబడి ఉన్నాం

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రహదారులు, సురక్షితమైన ప్రయాణం అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ అర్వింద్ అన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేస్తామని తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి, బ్లాక్ స్పాట్ల నివారణ, వంతెనలు, బైపాస్‌లు, ఇతర రోడ్డు భద్రతా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1,023 కోట్లు కేటాయించిందని ఎంపీ అర్వింద్ తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రోడ్డు భద్రతా పనులను మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

Center takes a big step towards road safety in Telangana