Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 6:24 pm Posted by : ramakrishna

జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి

 

. . . శిక్షణ తరగతుల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జన గణన విధులను పక్కాగా నిర్వహించాలని, అప్పుడే ఆయా వర్గాల ప్రజలకు భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చి కార్యాచరణను అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సెన్సెస్ – 2027 ను పురస్కరించుకుని జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే తహసిల్దార్లకు, సంబంధిత శాఖల అధికారులకు బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ నెల 13 వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుండగా, హైదరాబాద్ నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్ అవగాహన కల్పిస్తున్నారు. జనాభా గణన కోసం ఎలా సన్నద్ధం కావాలి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ, 2011 లో చివరిసారి జనాభా గణన జరిగిందని గుర్తు చేశారు. వాస్తవానికి 2021 లో ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా, కరోనా తీవ్రత వల్ల నిర్వహించలేదని అన్నారు. ప్రస్తుతం సాంకేతికతను వినియోగిస్తూ, డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరిపేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తొలి దశలో నివాస గృహాలతో పాటు అన్ని రకాల కట్టడాలు, కుటుంబ వివరాలను సేకరించడం జరుగుతుందని, రెండవ విడతలో వ్యక్తిగత వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా జన గణన జరపాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే గతేడాది నల్గొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాల్లో ప్రయోగాత్మకంగా కుటుంబ, ఇళ్ళ వివరాల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారని కలెక్టర్ గుర్తు చేశారు. జన గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై వాస్తవ వివరాలు వెల్లడించాలని సూచించారు. ఏ ఒక్కరి వివరాలు సైతం ఎక్కడ కూడా బయటికి వెల్లడి కావని, నేరుగా సర్వర్ లో నిక్షిప్తం అయ్యేలా సాంకేతికతను వినియోగిస్తున్నారని అన్నారు. ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంతో ముఖ్యమని, అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. చార్జ్ ఆఫీసర్లు ప్రతిరోజూ జన గణన ప్రక్రియను సమీక్షించాలని, తాము కూడా రోజువారీగా పర్యవేక్షణ జరుపుతామని అన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో నిర్దేశిత గడువు లోపు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను మెరుగైన రీతిలో పూర్తి చేసేలా సన్నద్ధం చేయాలన్నారు. ప్రణాళికల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు దోహదపడే జన గణన ప్రక్రియను నిబద్ధత, అంకితభావంతో నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Census duties should be carried out properly.