Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2024, 3:24 pm Posted by : ramakrishna

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరం (కలెక్టరేట్)లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించి, జాతీయ విద్యా విధానం అమలు చేశారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అబుల్ కలాం ఆజాద్ అని కీర్తించారు. ఆయన మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా అబుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారి నాగూరావు, ఇంచార్జ్ డీపీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.