Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 5:59 pm Posted by : ramakrishna

డీఈఓ కార్యాలయంలో తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

 

. . . పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వివిధ సందర్భాల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాధాన్యతను వివరించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మాత్రం ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నా రు. ఇటీవల డీఈఓ తన చాంబర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారని, అదే సమయంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కూడా కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కృపాల్ సింగ్ సోడి పేర్కొన్నారు. అయితే కొంతమంది సిబ్బంది డీఈఓకు విజ్ఞప్తి చేయడంతో కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు నిలిచిపోయిందని ఆరోపించారు. కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు ఎన్ఓసీలు, మెడికల్ బిల్లులు, డిప్యూటేషన్లు, ఇంక్రిమెంట్లు, ఎస్ఎస్సీ పరీక్ష విధులు, కారుణ్య నియామకాలు, ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు వంటి వివిధ పనుల కోసం అధికారులను సంప్రదిస్తుంటారని ఆయన తెలిపారు. కార్యాలయంలో జరిగే కార్యకలాపాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడం వల్ల పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత మరింత పెరుగుతాయని అన్నారు. సిబ్బంది సమయపాలన, కార్యాలయ విధుల నిర్వహణపై కూడా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా కార్యాలయ కార్యకలాపాలు పారదర్శకంగా సాగేందుకు వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పీఆర్టీయూ తెలంగాణ జిల్లా పక్షాన కోరారు.