Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 11:25 pm Posted by : ramakrishna

సీసీఎస్ కానిస్టేబుల్ పై కత్తితో పాతనేరస్థుడి దాడి

  • చికిత్సకు తరలిస్తుండగా మృతి
  • అడ్డుకునేందుకు యత్నించిన ఎస్ఐ, కానిస్టేబుల్ కు గాయాలు
  • నిజామాబాద్ నగరంలో ఘటన

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. పరారీలొ ఉన్న మహమ్మదీయ నగర్ కాలనీకి చెందిన పాత నేరస్తుడు రియాజ్ అరబ్ ను  సీసీఎస్ పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసులపై ఎదురు తిరిగి తన వద్ద ఉన్న కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ దాడిలో గాయపడ్డ సీసీఎస్ కానిస్టేబుల్ ను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనలో సీసీఎస్ ఎస్ఐకి కూడా గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని మహమ్మదీయ నగర్ కాలనీకి చెందిన రియాజ్ పలు దొంగతనాల కేసులో పాతనేరస్తుడు.  ఇటీవల కాలంలో అతడు పరారీలో ఉన్నాడు. నగరంలోని  సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విఠల్ తో పాటు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (43 ) తో పాటు మరో కానిస్టేబుల్ లు పాత నేరస్తుడు రియాజ్ ను శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. రియజ్ ను సీసీఎస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రమోద్ బైక్ నడుపుతుండగా నేరస్థుడు వెనుక కూచున్నాడు. వినాయక్ నగర్ ప్రాంతంలో రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్ ను పలు మార్లు పొడిచాడు.. అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎస్ఐ విఠల్ పై దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ ను అదే రోడ్ లో వెళ్తున్న మోపాల్ ఎస్ఐ తన వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు. సీసీఎస్ ఎస్ఐ విఠల్ తో పాటు మరో కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థతి నిలకడగానే ఉందని తెలిసింది. ఇటీవల బదిలీలో సీసీఎస్ కానిస్టేబల్ ప్రమోద్ ట్రాఫిక్ నుంచి సీసీఎస్ కు బదిలీపై వచ్చినట్లు సమాచారం. అతని సోదరుడు కూడా పోలీస్ శాఖలో పని చేస్తున్నారు.  నేరస్తుడి దాడిలో సీసీఎస్ కానిస్టేబుల్ మృతి చెందడంతో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. పరారీలో ఉన్న నిందితుడు రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

CCS constable attacked with knife by ex-convict

  • సమద్ గ్యాంగ్ సభ్యుడు… 43 కేసులలో రియాజ్ నిందితుడు..

రియాజ్ నిజామాబాద్ నగరంలో పలు కేసులలో నిందితుడు. ప్రధానంగా చోరీలు, గొలుసు దొంగతనాలు లాంటి కేసులు అతడిపై 43 కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన సమద్ అనే రౌడి షీటర్ గ్యాంగ్ సభ్యుడిగా రియాజ్ సుపరిచితుడు. సమద్ పాల్గొన్న అన్ని దొంగతనాల కేసులో రియాజ్ కు ప్రమేయం ఉంది. ఇటీవల కాలంలో సమద్ తో పాటు రియాజ్  కుడా పరారీలో ఉన్నారు. రియాజ్ పై పోలీసులు వరుస కేసుల నేపథ్యంలో షీట్ ఒపెన్ చేశారు. సమద్, రియాజ్ లో స్థానికంగా ఉన్నారు అనే సమాచారం తెలిసి సీసీఎస్ పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సమద్ పరారీ కాగా రియాజ్ ను సీసీఎస్ పొలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్ పై కత్తితో దాడి చేశారు. నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు , దొంగలు, చీటర్లు , చైన్ స్నాచర్ లు కత్తులు లేకుండా బయటకు వెళ్లరు అనే నానుడి ఉంది. శత్రు గ్యాంగ్ లతో గొడవలతో పాటు సాధారణ ప్రజలను భయ పెట్టడానికి కత్తులు చూపడం బెదిరించడం నిత్యం జరిగే తంతు. రియాజ్ ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు అతని వద్ద కత్తులు ఉంటాయా అని అంచనా వేయలేకపోవడమే వారి ప్రాణాల మీదకు తెచ్చింది.

  •  2003 బ్యాచ్ కు చెందిన ప్రమోద్..

నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్ పరిధిలోని వినాయక్ నగర్ లో పాత నేరస్థుడు రియాజ్ చేతిలో హత్యకు గురైన ప్రమోద్ 2003 లో కానిస్టేబుల్ గా రిక్రూట్ అయ్యారు. అతని తండ్రి నగరంలోని రైల్వే కమాన్ వద్ద ఉంటు తాహసీల్ధార్ గా పని చేసి పదవి విరమణ చేశారు. ప్రమోద్ సోదరుడు నర్సింగ్ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఇటీవల వరకు ట్రాఫిక్ లో పనిచేసిన ప్రమోద్ బదిలీలలో భాగంగా సీసీఎస్ లో చేరినట్లు తెలిసింది. ప్రమోద్ కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరితో సౌమ్యంగా ఉండే ప్రమోద్ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు వదలడం కుంటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

CCS constable attacked with knife by ex-convict