- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులం కుంపట్లు
- ప్రధాన అభ్యర్థులంతా రెడ్డి సామాజిక వర్గంవారే
- బిజినెస్ టీచర్లే ప్రజాప్రతినిధులుగా ఎన్నికకు యత్నాలు
నిజామాబాద్, బతుకమ్మ : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉండాల్సిన ఎమ్మెల్సీ పదవి అంగ, అర్ధబలం ఉన్నవారితో పాటు కులం బలం ఉన్న వారే చట్టసభలకు ఎన్నికయ్యే పరిస్థితులు దాపురించాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయులు ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయి. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా ఎవరు కూడా తమ నామినేషన్లను వెనక్కి తీసుకోలేదు. 16 మంది బరిలో నిలిచి ఉండడం ఖాయమైంది. 27వేల పైచిలుకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే ఎన్నికలు ఈ నెల 27న జరుగనున్నాయి. హైస్కూల్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, కొందరు లెక్చరర్లు, కొన్ని గుర్తింపు పొందిన పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకుని ఎమ్మెల్సీని ఎన్నుకోనున్నారు. అయితే ప్రస్తుతం బరిలో నిలిచిన 16 మందిలో ప్రధాన అభ్యర్థులంతా అగ్రవర్ణాల వారే ఉండడం కొత్త చర్చకు దారి తీసింది. అంతేగాకుండా ఉపాధ్యాయ రంగానికి ఏనాడో వీడి బిజినెస్ టీచర్లుగా అవతారమెత్తిన వారు ఇప్పుడు అవకాశం వచ్చిందని టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ముందుకు రావడం ఉపాధ్యాయ వర్గాల్లో ఆలోచన మొదలయింది. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టిన తర్వాత ప్రధానంగా వెనుకబడిన వర్గాలో విద్య, ఉద్యోగ, ప్రమోషన్లలో తాము అట్టడుగు ఉన్నామని గుర్తించే క్రమంలోనే రాజకీయంగా తమ ప్రాతినిధ్యం ఏమిటని చర్చ జరుగుతుంది.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎస్టీయూ నుంచి రఘోత్తంరెడ్డి, సీపీఎస్ నుంచి తిరుమల్ రెడ్డి చిన్నారెడ్డి, పీఆర్ టీయూ నుంచి వంగ మహేంధర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. ఎన్నికల సమయానికి ప్రధాన అభ్యర్థులందరినీ అగ్రవర్ణాలకు ఎంపిక చేయడం ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల్లో తమ ప్రాతినిధ్యం ఏమిటని ప్రధానంగా టీచర్ల సామాజిక వర్గంలో చర్చ జరుగుతుంది. పీఆర్ టీయూ నుంచి బరిలో దిగిన వంగ మహేంధర్ రెడ్డి కొన్ని సంవత్సరాల క్రితమే ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ మ్యాన్ గా అవతారమెత్తారు. బీసీల నుంచి బీజేపీ బలపరుస్తున్న మల్కపురం కొమురయ్య ఫక్తు బిజినెస్ మ్యాన్ గా చెబుతారు. కార్పొరేట్ స్కూల్ ను నడుపుతూ ఏనాడు ఉపాధ్యాయుల సమస్యలు తెలియని వ్యక్తిని బీసీ సామాజిక వర్గ అభ్యర్థిగా బరిలోకి దించి గెలువాలనే ఆలోచన అని టీచర్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బీసీ జపం చేస్తుండగా కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పటి వరకు తేటతెల్లం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన వామపక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కులాల కుంపట్లను రాజేసినట్లయింది. మేమెంతో మాకు అంతా అని నినాదంతో బీసీలు తమ డిమాండ్ల కోసం ప్రయత్నాలు చేసిన విషయం తెల్సిందే. అందుకు ఇటీవల జరిగిన కులగణనతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 42 శాతం సీట్ల కేటాయింపు బీసీలకేనని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అలాంటి సమయంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పక్షాలన్నీ అగ్రవర్ణాలకు, బిజినెస్ టీచర్లకు అవకాశం ఇవ్వడంతో వెనుకబడి వర్గాల్లో తాము ఎన్నుకునే అభ్యర్థి విషయంలో ఎవరి మాట వినేది లేదన్నట్లుగా చర్చించుకుంటున్నారు. 27 వేల టీచర్ల ఓట్లలో 6400 ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు, 1400 మైనార్టీ టీచర్లు, 11200 బీసీ టీచర్లు, 8 వేల ఓసీ టీచర్లు ఓటర్లుగా ఉన్నట్లు అంచనా ఉంది. బీసీలలో అత్యధికంగా మున్నూరు కాపులు 3300, పద్మశాలిలు 3000, ముదిరాజ్ లు 2600, ఇతర వెనుకబడిన తరగతుల టీచర్లు 2 వేల వరకు ఉన్నట్లు లెక్కలు కడుతున్నారు. అయితే సుమారు 50 శాతంకు పైగా ఉన్న ఉపాధ్యాయులు తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారని చర్చజరుగుతుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అన్నీగ్రూప్ ల్లో ఉపాధ్యాయ సంఘాల్లో ఇదే చర్చ మొదలయింది. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ హాట్ హాట్ గా సాగుతుంది. బీసీలకు ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనార్టీలు తోడయితే వారు బలపర్చిన అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే. అయితే విద్యార్థి లోకాన్న తీర్చిదిద్దే ఉపాధ్యాయుల్లో ఎన్నికల వేళ కులాల కుంపట్ల తుట్టేను కదపడంతో రాజకీయ వేడి రాజుకుంది.