Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2024, 5:48 pm Posted by : ramakrishna

అమ్మిన వారిని వదిలి కొన్న వారిపై కేసులు

  •  249 సర్వే నంబర్ లో ప్లాట్లు కొన్న వారిపై కేసులు
  •  అధికార యంత్రాంగం చిత్రివిచిత్ర నిర్ణయాలు

నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇళ్ళు కట్టుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని తహసీల్ధార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వెంట వెంటనే కేసులు నమోదు కావడం చకచక జరిగిపోయాయి. పేదలు కబ్జా చేస్తే ఒక విధంగా పెద్దోళ్ళు కబ్జా చేస్తే మరో విధంగా యంత్రాంగం పని చేస్తుందనడానికి ఇటీవల నిజామాబాద్ నార్త్ తహసీల్ధార్ ఉత్తర్వులే నిదర్శనంగా చెప్పాలి. నిజామాబాద్ నడిబొడ్డున ప్రభుత్వ స్థలాలు, ఈనామ్ భూములు, శిఖం భూములు కబ్జాలకు గురై కోట్ల రూపాయలు చేతులు మారుతుంటే పట్టించుకోని యంత్రాంగం ప్రభుత్వ భూమిలో పేదలు పక్కా ఇళ్ళు, రేకుల ఇళ్ళు కట్టుకున్నారని కేసులు నమోదు చేయడం కలకలం రేపుతుంది. అయితే అక్కడ పేదలు రూపాయి రూపాయి పోగేసి ఇతరుల వద్ద కొనుగోలు చేసిన భూమిలో ఇళ్ళు కట్టుకుంటే కేసులు నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అమ్మిన వ్యక్తులను వదిలి కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్న వారిపై కేసులు నమోదు అంశం చర్చనీయాంశంగా మారింద.

Cases against those who bought and left those who sold

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి శివారులోని సర్వే నంబర్ 249లో 23.7 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందుకు సంబంధించిన భూమి వివరాలు రికార్డులు పక్కాగా ఉన్నాయి. అయితే ఎలక్ట్రిషియన్ కాలనీ అని కొత్తగా వెలిసింది. అక్కడ సర్కారు భూములు కొందరు పేదలకు అమ్ముకున్నారు. మూడు లక్షల నుంచి లక్ష రూపాయల వరకు అమ్మకాలు జరిగాయి. అందులో కొందరు పక్కా ఇళ్ళు నిర్మించుకున్నారు. ఈ యేడాది అక్కడ 249 సర్వే నంబర్ లోని 1581 గజాలు కబ్జాకు గురైందని కొందరు ఫిర్యాదు చేశారు. దానిపై సర్వేయర్లు, గిర్ధావర్లు సర్వే నిర్వహించి కబ్జా ఉన్నది వాస్తవమేనని తేల్చారు. దానితో అక్కడ కబ్జాలో ఉండి పక్కా ఇళ్ళు కట్టుకున్న, పునాదుల వరకు నిర్మించిన ఇళ్ళు , రేకుల ఇళ్ళు బేస్ మెంట్ వేసిన వారిని గుర్తించి 14 మంది కబ్జాదారులుగా నోటీసులు ఇచ్చారు. అయితే అక్కడ సంబంధిత భూమిలో వివాదంపై కొందరు న్యాయస్థానంను కూడా ఆశ్రయించినట్లు తెలిసింది.

నిజామాబాద్ ఉత్తర మండల తహసీల్ధార్ 14 మంది కబ్జాదారులకు కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు గత నెల 17న ఫిర్యాదు చేశారు. తహసీల్ధార్ ఫిర్యాదు నేపథ్యంలో 13 మందిపై కేసుల నమోదయ్యాయి. ఎంఐఎం పార్టీకి చెందిన నాయకులు గతంలో ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం, పోలీసు శాఖ వెంట వెంటనే స్పందించడం వరకు బాగానే ఉంది. కానీ వారిపై కేసులు నమోదు చేయడం భూముల రక్షణ కొరకే అని చెప్పాలి. అయితే భూములను అమ్మిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం పై ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయాజ్ ఉన్నతాధకారులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Cases against those who bought and left those who sold9654