ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి అటవీ రేంజ్ పరిధిలోని ధర్పల్లి మండలం దుబ్బాక శివారులో గల డీబీ తండా సమీపంలో అటవీ శాఖ భూమిని అక్రమంగా చదును చేస్తున్న ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ధర్పల్లి ఎస్సై సందీప్ తెలిపారు. అటవీ శాఖకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దుబ్బాక సెక్షన్ అధికారి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా, ఇద్దరు ట్రాక్టర్ల సహాయంతో అటవీ శాఖ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ తెలిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించగా, డీబీ తండాకు చెందిన భూక్య సిసిందర్, భూక్య గణేష్, భూక్య భిక్య, భూక్య సకరం, భూక్య వార్య, భూక్య శుక్య, భూక్య అనిల్‌లు అటవీ అధికారిపై దుర్భాషలాడుతూ, విధుల నిర్వహణకు ఆటంకం కలిగించి తోసివేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వారు రెండు ట్రాక్టర్లతో అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేయగా, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన ఆరోపణలపై పై పేర్కొన్న ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ధర్పల్లి ఎస్సై సందీప్ వెల్లడించారు.