నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, బైక్ నడుపుతూ వస్తున్న ఒక వ్యక్తిని ఆపి వాహన పత్రాలు చూపించాలని కోరగా, ఆయన బైక్ నంబర్ TS16EX5260 కు సంబంధించిన ఆర్సీ పత్రాలు చూపించాడు. అతని పై అనుమానం రావడంతో, పోలీసులు బైక్ యొక్క చస్సిస్ నంబర్, ఇంజిన్ నంబర్ పరిశీలించగా, ఆర్సీ పత్రాలలో ఉన్న వివరాలకు సరిపోలకుండా వేరుగా ఉన్నట్లు తేలింది, వెంటనే అతన్ని విచారించగా నగరంలోని గౌతంనగర్ లో గల దుబ్బ ప్రాంతానికి చెందిన కుమ్మం మహేష్ గా తెలిపాడు. తన బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, ట్రాఫిక్ చలాన్లు పడకుండా తప్పించుకోవడానికి ఫేక్ నెంబర్ ప్లేట్ అమర్చుకుని గత మూడు నెలలుగా బైక్ నడుపుతున్నట్లు ఒప్పుకున్నాడు. అతన్ని బైక్‌తో పాటు ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్, నిజామాబాదు లో అప్పగించగా, అతని బైక్ సీజ్ చేసి అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు కూడా తప్పుడు నెంబర్ ప్లేట్లు అమర్చి వాహనాలు నడపరాదని, ఇలాంటి చర్యల్లో పట్టుబడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.