. ప్రయాగ్ రాజ్ రూట్ లో వందల కిలో మీటర్ల మేర స్తంభిస్తున్న ట్రాఫిక్
. ఇబ్బందులు పడుతున్న యాత్రికులు.. గంటల తరబడి వాహనాల్లో నిరీక్షణ
వెబ్ న్యూస్, బతుకమ్మ: మహా కుంభ మేళాలో అమృత స్నానం ఆచరించేందుకు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రయాగ్ రాజ్ కు బయల్దేరుతున్న భక్తులు చుక్కలు చూస్తున్నారు. ప్రయాగ్ రాజ్ రూట్ లో వందల కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభిస్తుండడంతో ముందుకు కదలలేక, వెనక్కి రాలేక గంటల తరబడి వాహనాల్లో నిరీక్షిస్తున్నారు. మౌని అమావాస్య రోజున కోట్లాది మంది తరలిరావడంతో తొక్కిలాట చోసుకున్న విషయం తెలిసిందే. బుధవారం మాఘ పూర్ణిమను పురస్కరించుకుని అమృత స్నానం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు బయల్దేరారు. వందల కిలో మీటర్ల దూరంలోనే వాహనదారులను మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. వీలైతే వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని, లేదా హోటళ్లలో బస చేసి రద్దీ తగ్గిన తరువాత ప్రయాగ్ రాజ్ కు వెళ్లాలని సూచిస్తున్నారు. మంగళవారం ఉదయం 4గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్ గా అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. కుంభ మేళా ప్రాంతానికి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే అవకాశం లేకపోవడంతో కిలో మీటర్ల మేర భక్తులు కాలినడకన వెళ్తున్నారు. వసంత పంచమి నాటికే 45 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంఘానికి వచ్చారని యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మహా శివ రాత్రితో కుంభ మేళా ముగియనుంది.
