. . . మేరా యువ భారత్ అధికారి బి.రమేష్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ కార్యక్రమం ద్వారా నిజామాబాద్ జిల్లాలో యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ – కామారెడ్డి జిల్లాల మేరా యువ భారత్ అధికారి బి. రమేష్ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేయడం, ప్రతి గ్రామంలో యువజన సంఘాల ఏర్పాటు, సామాజిక సేవ పట్ల యువతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. యువ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండడంతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందినవారై, సామాజిక సేవ పట్ల ఆసక్తి కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు మై భారత్ అధికారిక పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుకు ఎలాంటి రుసుము ఉండదని, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 20, 2026 అని పేర్కొన్నారు. ఎంపికైన యువ వాలంటీర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం రెండు సంవత్సరాల పాటు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున యువ వాలంటీర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందని, ఎంపికైన వారికి శిక్షణతో పాటు సర్టిఫికెట్ కూడా అందజేయబడుతుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం మేరా యువ భారత్, నిజామాబాద్ కార్యాలయాన్ని 7780338076 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.