. . . కంఠేశ్వర్ శివారులో అవినీతి అధికారుల పెట్టుబడులు
. . . కొత్త కలెక్టరేట్ ఏర్పడిన తర్వాత బైపాస్ రోడ్డు వెంట పెరిగిన దందాలు
. . . లీడర్లు, కాంట్రాక్టర్లతో కలిసి దందాలు
నిజామాబాద్, బతుకమ్మ :
అవినీతి అధికారులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను పెట్టుబడి పెట్టి దందాలు చేసేందుకు నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డును ఎంచుకున్నట్లు కనబడుతుంది. ఇటీవల కాలంలో ఏసీబీ దాడుల్లో దొరికిన చిట్టాను పరిశీలిస్తే అది బహిర్గతమౌతుంది. దొరికిన వారు కొందరైతే దొరకని వారు మరికొందరు. రియల్ ఎస్టేట్ కన్ స్ట్రక్షన్, లిక్కర్ దందాలతో పాటు ఫైనాన్స్ (జీరో వడ్డి) వ్యాపారం చేస్తున్న సంగతి తెల్సిందే. ఉద్యోగ సంఘాల లీడర్ల ముసుగులో అవినీతి అధికారులు బినామీ దందాల కేరాఫ్ అని చెప్పాలి. వారు రాజకీయ నాయకుల మాదిరిగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల తొత్తులుగా బినామీ దందాలకు అడ్రస్ గా నిలుస్తున్నారు. తమ అవినీతి సొమ్మును బినామీల పేర్లపై దందాలు చేస్తుండడంతో వారి అవినీతి, అక్రమాలు ఏసీబీ దాడులతోనే వెలుగు చూస్తున్నాయి. అయితే కేవలం ఇతర జిల్లాలో ఏసీబీ దాడులతోనే అవినీతి, అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయని జిల్లాలో అవినీతి అధికారులపై ఎందుకు కొరడా ఝలుపడం లేదన్న చర్చ జరుగుతుంది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన మోహన్ నాయక్ రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గా పని చేస్తూ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారని మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే. ఆయన వంద కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో నిజామాబాద్ బైపాస్ రోడ్డులో కోటి రూపాయలు వెచ్చించి విల్లా (రెవెన్యూ శాఖలో తహసీల్ధార్ బినామీ బిల్డర్ గా) నిర్మిస్తున్నట్లు గుర్తించారు. మోహన్ నాయక్ బినామీ అని గంగాస్తాన్ లో ఏసీబీ అధికారులు ఓ కాంట్రాక్టర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన తన పెట్టుబడులను రియల్ ఎస్టేట్ తో పాటు బిల్డర్ గా ఉన్నారని, బైపాస్ రోడ్డులో పెట్టుబడులు పెట్టారనే చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా పని చేసిన శంకర్ నాయక్ ఏసీబీకి చిక్కారు. ఆయన బైపాస్ రోడ్డులో కోట్ల విలువైన హోటల్ తో పాటు ఓపెన్ స్థలానికి యజమాని అని తేలింది. కేవలం ఇద్దరు అధికారులే కాకుండా రెవెన్యూ, ల్యాండ్ సర్వే, ఎక్సైజ్, సివిల్ సప్లయ్, రవాణా శాఖ లో పని చేస్తున్న చాలా మంది బినామీలుగా బైపాస్ రోడ్డులో పెట్టుబడులు పెట్టి దందాలు చేస్తున్నారనేది బహిరంగ టాక్.

నిజామాబాద్ నగర శివారు అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు బైపాస్ రోడ్డు. ఒకప్పుడు 5 నుంచి 10 లక్షలకు ఎకరానికి ధర పలుకని ప్రాంతం. దివంగత నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ హయంలో నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఏర్పాటు చేసిన రోడ్డే బైపాస్ రోడ్డు. దానికి నాలుగు వరుసల రహదారిని, ఆరు వరుసలకు పెంచిన ఇప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఆ రోడ్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కలెక్టరేట్ నిర్మించడంతో ఎక్కడా లేని డిమాండ్ వచ్చి పడింది. అంతేగాకుండా నిజామాబాద్ నగరంలో డెవలప్ మెంట్ కోసం మిగిలిన ఏకైక ప్రాంతంగా హైదరాబాద్, ఆర్మూర్ రోడ్డును అనుసంధానం చేస్తూ ఉన్న బైపాస్ రోడ్డు ఇప్పుడు హాట్ కేక్ గా మారింది. కలెక్టరేట్ మొదలుకుని మాదవనగర్ వరకు ఉన్న భూములకు ఇప్పుడు రెక్కలు వచ్చాయి. ఎకరం కోట్ల విలువ చేస్తుండగా బినామీలుగా అధికారులే పెట్టుబడి పెట్టడం విశేషం. ఉద్యోగ సంఘాల్లో లీడర్లుగా చెలామణి అవుతున్న వారే బినామీలు పెట్టుబడులు పెట్టినట్లు చర్చించుకుంటున్నారు. ఉద్యోగులతో పాటు ఎక్సైజ్, పోలీసులు అధికారులు కూడా భూములకు బినామీ యజమానులుగా వ్యవహరించడం విశేషం. గతంలో నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పలువురు పోలీసులే ఫోర్జరీ డాక్యుమెంట్ మీదుగా భూముల్లో పెట్టుబడులు పెట్టినట్లు బహిర్గతమైంది. ఏసీబీ అధికారులు ఇతర ప్రాంతంలో దాడి చేస్తే గానీ నిజామాబాద్ బైపాస్ రోడ్డులో అధికారుల పెట్టుబడులు బహిర్గతం కావట్లేదనే ఆరోపణలున్నాయి. అవినీతి నిరోధక శాఖాధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహరంలో నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని అందుకే అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందని బినామీలుగా దందాలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి