నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించకుండా కేవలం మొక్కుబడిగా 7.5% నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ పాలిటెక్నిక్ కళాశాలలో పీడీఎస్యూ(ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత) ఆధ్వర్యంలో బుధవారం బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అని కేటాయించిన 7.5% నిధులు ఉద్యోగుల జీతాలకు మాత్రమే కేటాయించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15% నిధులు కేటాయిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని డప్పులు కొట్టుకునే ప్రభుత్వం నిధులు లేకుండా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని ప్రశ్నించారు. విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, పెంచిన కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా నాణ్యమైన ఆహారాన్ని సంక్షేమ హాస్టల్లో అందించకుండా విద్యాభివృద్ధి ఏ విధంగా జరుగుతుందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరం చేయడానికి మాత్రమే ఈ రాష్ట్ర బడ్జెట్ ఉంటుందే గాని విద్యార్థులకు పురోగభివృద్ధి దిశగా ఉండదన్నారు. పేద విద్యార్థులకు అండగా ఉంటాం, పేదలకు అండగా ఉంటాం అంటూ గొప్పలు చెప్పుకోవడమే కాదని ఆచరణలో చూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 శాతాన్ని విద్యారంగానికి కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల, తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిజామబాద్ జిల్లా విద్యార్థుల, ప్రజల ఆకాంక్షను నెరవేర్చే వైపు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు,మంత్రులు,పిసిసి అధ్యక్షులు ప్రభుత్వ సలహాదారులు అధికార ప్రతిపక్ష నాయకులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాల కేటాయించుకుంటే, అన్ని జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఉంటే, నిజామాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఏం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా విద్యార్థుల ప్రజల ఆకాంక్షల నెరవేర్చే ఆలోచన ఇక్కడి అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులది కదా అని అడిగారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల పీడీఎస్యూ నాయకులు తరుణ్,శ్రీకాంత్,యశ్వంత్,వర్ధన్,చారి,అఖిల్, శివ, భువనేష్, శ్రీమన్,అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.