Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 7:12 pm Posted by : ramakrishna

సాయంత్రం 6 దాటితే ఇసుక మొరం వాహనాలు తగలబెట్టండి

 

. . . ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

 

మాక్లూర్, బతుకమ్మ :

 

అక్రమ మొరం, ఇసుక రవాణాపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇసుక లేదా మొరం తరలించే వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టాలంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. మాక్లూర్ మండలంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ  జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు అక్రమార్కులు రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఇసుక, మొరం తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా గ్రామాల్లో రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పగటిపూట అనుమతులు ఉన్న సమయాల్లో మాత్రమే రవాణా జరగాలని, చీకటి పడ్డాక రోడ్లపైకి వచ్చే అక్రమ వాహనాలను ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మాక్లుర్ మండల వ్యాప్తంగా గుట్టలను తవ్వేసి అక్రమంగా మొరం కొన్నేళ్లుగా తరలిస్తున్న అధికారులు మాత్రం అవేమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాహనాలకు నిప్పు పెట్టండి అనే ఘాటైన వాక్యాలు చేశారని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ఈ వ్యాఖ్యలపై వాహన దారులు, రవాణా రంగ ప్రముఖుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనది కాదని కొందరు అంటుండగా అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమని స్థానికులు మద్దతు తెలుపుతున్నారు.