- ఇందూర్ టు ఎల్కతుర్తి
- భారీ ఎత్తున తరలనున్న గులాబీ శ్రేణులు
- ప్రజలను తరలించేందుకు నాయకుల ప్రణాళికలు
నిజామాబాద్, బతుకమ్మ: ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి 25 ఏళ్ల ఉత్సవానికి ముస్తాబవుతోంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లనున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయి 17 నెలల తర్వాత బహిరంగ సభకు కేసీఆర్ పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపినట్లయింది. అధికార కాంగ్రెస్ పార్టీ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమౌతున్న వేళ కేసీఆర్ బహిరంగ సభ నిర్వాహణ ద్వారా క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చేందుకే అనే చర్చ జరుగుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన లీడర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయా ప్రాంతాల్లో క్యాడర్ లో నిస్తేజం ఆవహించింది. అదే సమయంలో నాయకత్వ లేమితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలిచే నాయకగణం లేకపోవడంతో బీఆర్ఎస్ ముందస్తు ట్రిట్ మెంట్ కు సిద్దపడే రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమైంది.
తెలంగాణ రాష్ర్ట సమితి ప్రారంభం నుంచి వెన్నుదన్నుగా నిలిచింది నిజామాబాద్ జిల్లా. స్థానిక ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు అండగా నిలుస్తూ సీట్లను కట్టబెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకుని బోణి కొట్టిందే ఇందూరు నుంచే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలోనూ, ఉప ఎన్నికల్లోనూ నిజామాబాద్ జిల్లా కేసీఆర్ వెంటే నడిచింది. ఉప ఎన్నికల్లోనూ బీఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించడంతో పాటు మిత్రపక్ష అభ్యర్థులకు అండగా నిలబడింది. తెలంగాణ సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో ఇందూర్ ది ఎనలేని పాత్ర. ఆనాడు కేసీఆర్ పాదయాత్రలో భాగంగా వేల్పూర్ మండలం మోతేలో గుప్పెటి మట్టితో కట్టిన ముడుపును రాష్ట్రం సాధించిన తర్వాతనే విప్పిన విషయం విధితమే. ప్రత్యేక రాష్ట్రం సాధన తర్వాత ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు జిల్లా ప్రజలు నీరాజనం పట్టారు. స్థానిక సంస్థలతో పాటు అన్నీ అసెంబ్లీ స్థానాలను, పార్లమెంట్ స్థానాలను బీఆర్ఎస్ కు కట్టబెట్టారు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి మాత్రమే జిల్లాలో రాజకీయాల్లో మార్పులు సంభవించాయి. ప్రధానంగా కవిత ఓటమి తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొంది తర్వాత రెండవసారి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడంతో జిల్లాలో కవిత అనుచరవర్గంలో కలవరం మొదలయింది. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చావుదెబ్బ అని చెప్పాలి. 9 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు స్థానాల్లో గెలుపొందగా పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాలను చేజార్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పోచారం కారు దిగ చేయికి స్నేహ హస్తం అందించడంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరే ప్రజాప్రతినిధులు మిగిలారు. ఒకరు ప్రశాంత్ రెడ్డి కాగా మరొకరు కల్వకుంట్ల కవిత.
కాంగ్రెస్ పార్టీ 17 నెలల పాలన వైఫల్యాలను ఎండగట్టి స్థానిక సంస్థల్లో పాగా వేయాలని బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. అయితే జిల్లాలో పార్టీని ఏకతాటిపైకి నడిపే నాయకత్వం కరువైంది. ఓటమి తర్వాత మాజీలందరూ హైదరాబాద్ కు పరిమితమయ్యారు. అడపాదడపా స్థానిక సమస్యలపై పార్టీ ఆదేశాల మేరకు కార్యకలాపాల్లో పాల్గొంటుండగా పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాడర్ కు లీడర్లే కరువయ్యారు. బోధన్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఆర్మూర్,నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మాజీలు అడపాదడపా కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పటికీ పార్టీకి ప్రధానంగా క్యాడర్ మనోధైర్యం కల్పించడంలో విఫలమౌతున్నారన్న విమర్శలు మూగట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా అధినేతకు తాము నియోజకవర్గాల్లో ఉండి కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని చాటి చెప్పేందుకు తాజా, మాజీలు కసరత్తు చేస్తున్నారు. రజతోత్సవ వేడుకలను ఉఫయోగించుకునేందుకు క్యాడర్ ను పెద్ద ఎత్తున ఎల్కతుర్తికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.