Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 8:07 pm Posted by : ramakrishna

‘టెస్సరాక్ట్’ భూ కుంభకోణంపై లోకాయుక్తను ఆశ్రయించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘మెసర్స్ టెస్సరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ లోకాయుక్తను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 5 ఎకరాల విలువైన ప్రజా భూమిని సంస్థకు కేటాయించడంలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.135 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రజా భూముల ధారాదత్తం, బినామీ లావాదేవీలు, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం వంటి అంశాలకు సంబంధించి మొత్తం 13 కీలక ఆధారాలను లోకాయుక్తకు సమర్పించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థకు అప్పగించే ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారన్న అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ ఫిర్యాదును ఎమ్మెల్సీలు డా. దాసోజు శ్రవణ్ కుమార్, మంకెన కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, డా. సంజయ్ కల్వకుంట్లతో పాటు బీఆర్ఎస్ నాయకుడు డా. మన్నె క్రిశాంక్ కలిసి తెలంగాణ లోకాయుక్తకు సమర్పించారు. టెస్సరాక్ట్ సంస్థకు భూమి కేటాయింపు వెనుక ఉన్న నిర్ణయాలు, సంబంధిత అధికారుల పాత్ర, లావాదేవీల స్వభావం, ప్రజా ప్రయోజనాలకు జరిగిన నష్టంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.