. . . నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న బీఆర్ఎస్ నాయకులు
. . . ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో 4 వ వార్డు ఇస్లాంపురా కాలనీలో నివసిస్తున్న ఓ నిరుపేద కుటుంబం ఉంటున్న ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో వారు నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించినప్పటికీ, ఇంట్లోని సామగ్రి ధ్వంసమై కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం తలదాచుకునే స్థలం లేక బాధిత కుటుంబం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది.ఈ విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన వంతు ఆర్థిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందజేసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా షేక్ జుబేర్ బాన్సువాడ ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడి బాధిత కుటుంబాన్ని తాత్కాలికంగా తాడ్కోల్ డబుల్ బెడ్‌రూమ్ గృహాలకు తరలించి, అవసరమైన ప్రభుత్వ సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. అలాగే ప్రభుత్వం బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు శాశ్వత గృహాన్ని మంజూరు చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, మాక్బూల్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, బీఆర్ఎస్ నాయకులు రమేష్ యాదవ్, మొహమ్మద్ షఫీ, ఖాదర్, సీనియర్ నాయకుడు ఉస్మాన్, గంగారాం, ఖాలేద్, అఫ్జల్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
