వేల్పూర్ లో మొహరించిన ప్రత్యేక పోలీస్ బలగాలు
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆంక్షలు : సీపీ సాయి చైతన్య
వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పరస్పర సవాల్ విసురుకున్నారు. దీంతో నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఆదేశాలతో శాంతి భద్రత పరిరరక్షణకు 163 బీఎన్ యస్ యస్ అమలు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్ బుధవారం రాత్రి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ సవాళ్ల నేపథ్యంలో గురువారం ఉదయం వేల్పూర్ లో ప్రత్యేక పోలీస్ బలగాలను మొహరించారు. ఎటువంటి అల్లర్లు జరుగకుండా నిషేధ ఆజ్ఞలు విధించి, బందోబస్తూ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అబద్దాలు చెపుతున్నాడని, అదే లబ్ధిదారులతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి వారితోనే వేల్పూర్ లో కార్యక్రమం నిర్వహించి కనువిప్పు కలిగిస్తామని డీసీసీ అధ్యక్షుడు, స్టేట్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఘాటుగా స్పందించాయి. ఒకరినొకరు మీడియా ద్వార మీరు లబ్ధి పొందిన వారిని తీసుకొని రండి, మేము లబ్ధి పొందని వారిని తీసుకువస్తాం. అప్పుడు మాట్లాడుదామని సవాల్ కు ప్రతి సవాళ్ల ను విసురుకొన్నారు. కనువిప్పు కార్యక్రమం వేల్పూర్ నిర్వహించాలన్న మానాల సంకల్పానికి పోలీస్ కమీషనర్ అనుమతిని నిరాకరించారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ పథకాలు అందని లబ్ధిదారులతో ప్రతికూలంగా నిర్వహించే పరిచయ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదు. అటు కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్ రెడ్డి.. ఇటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరుల సవాల్ ప్రతి సవాళ్లతో సమస్య పెద్దదై శాంతిభద్రతలకు ఆటంకం కలుగుతుందని గ్రహించిన సీ.పీ సాయిచైతన్య వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రంతో పాటు మండల చుట్టూ పక్క గ్రామాల్లో 163 బీ ఎన్ యస్ యస్ ను అమలుకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ఈ సెక్షన్ అమలు లో ఉంటుందని సీ. పీ వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా ఈ సెక్షన్ అమలు లో ఉన్న ప్రాంతాల్లో నలుగురి కంటే ఎక్కవ మంది గుమ్మికూడవద్దని తెలిపారు. ఉత్తర్వులను అధిగమిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు చెప్పడ్తామని హెచ్చరించారు.
మానాల హౌస్ అరెస్టు
ప్రకటించిన విధంగా వేల్పూర్ లో కనువిప్పు కార్యక్రమానికి బయలుదేరేందుకు సిద్ధమైన డీసీసీ అధ్యక్షుడు, స్టేట్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిని నిజామాబాద్ నగరంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
