Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 9:35 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్, బీజేపీ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి

 

. . . రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ రైతు పక్షాన నిలబడిన చరిత్ర బీఆర్ఎస్, బీజేపీలకు లేదని విమర్శించారు. బీఆర్ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు రైతులు స్పందించకపోవడంతో కొందరు నాయకులు మిలిటెంట్ తరహా కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సింగరేణిని తగలబెట్టాలని, రైళ్లు ఆపాలని చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే 39 వేల మంది రైతులకు 3.78 లక్షల యూరియా బస్తాలు పంపిణీ చేశామని చెప్పారు. జిల్లాలోని 207 కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతోందని వివరించారు. యూరియా వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. మండల స్థాయిలో యాప్ ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందని, ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టా పాస్‌బుక్ లేని రైతులకు మండల రెవెన్యూ అధికారుల ద్వారా యూరియా అందజేస్తామని చెప్పారు. యూరియాపై ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించిన ఎమ్మెల్యే, రైతులకు యాప్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. రైతుల పేరుతో బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు కోరినా కేంద్రం స్పందించడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ, బీఆర్ఎస్‌ల ఉమ్మడి లక్ష్యమని ఆరోపించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కూడా ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై అర్వింద్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తున్న అర్వింద్ వాటికి ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. గత ఎనిమిదేళ్లలో నిజామాబాద్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేతలను అవినీతిపరులుగా విమర్శించిన బీజేపీ, ఇప్పుడు వారినే పార్టీలో చేర్చుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ నాయకత్వంపై కూడా ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్ పనికిరాడనే భావనతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. భవిష్యత్తులో కవిత కొత్త పార్టీ స్థాపించి బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు తగిన యూరియా కోటా కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజుగా నిలబెట్టిందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తోందని, విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. చివరగా, తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని, బీజేపీ – బీఆర్ఎస్‌లు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు.

 

BRS and BJP are misleading farmers.