లింగంపేట, బతుకమ్మ :
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో లింగంపేట మండలంలోని లింగంపల్లి గ్రామ సమీపంలో పాముల వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరద ఉధృతికి కోతకు గురైంది. దీంతో కామారెడ్డి – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి లింగంపేట, గాంధారి మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో పాములవాగుతో పాటు అనేక వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. పాములవాగుకు ఒక్కసారిగా భారీగా వరద నీరు చేరడంతో తాత్కాలిక వంతెనపై ఒత్తిడి పెరిగింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన భారీ చెట్ల దుంగలు, ముళ్ల పొదలు, చెత్తాచెదారం వంతెన నిర్మాణానికి ఉపయోగించిన సిమెంట్ పైపులకు అడ్డంగా చిక్కుకుపోయాయి. దీంతో నీటి ప్రవాహం సజావుగా సాగక, వరద నీరు రహదారిపై నుంచి ప్రవహించింది. ఫలితంగా తాత్కాలిక వంతెనకు గండిపడి రహదారి కోతకు గురైంది. దీంతో కామారెడ్డి – ఎల్లారెడ్డి మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల నిమిత్తం ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయత్నించగా, మరికొందరు వరద తగ్గే వరకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాల సమయంలో కూడా ఇదే పాములవాగు వంతెన వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పాములవాగును సందర్శించి, తక్షణ తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.1 కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వంతెన దెబ్బతినడంతో దాదాపు రెండు నెలల పాటు కామారెడ్డి–ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తదనంతరం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని మరో రూ.1 కోటి నిధులు మంజూరు చేయించారు. ఆ నిధులతో పాములవాగులో సిమెంట్ పైపులు ఏర్పాటు చేసి, వాటిపై మొరం పోసి తాత్కాలిక వంతెన నిర్మించారు. అప్పటి నుంచి వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడినప్పటికీ, ఈ ఏడాది మరోసారి భారీ వరదల ధాటికి అదే వంతెన కోతకు గురికావడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా, పాములవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లింగంపేట మండలంలోని ఐలాపూర్ – రాంపల్లి గ్రామాల మధ్య ఉన్న లో – లెవెల్ వంతెన కూడా వరద నీటిలో మునిగిపోయింది. వంతెనపై నుంచి భారీగా నీరు ప్రవహించడంతో అధికారులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ వంతెనల వద్దకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో పాములవాగు వరదల కారణంగా ఇదే సమస్య పునరావృతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక వంతెనలతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని, ప్రజల ప్రాణాలు, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పాములవాగుపై శాశ్వత హై-లెవెల్ వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.