Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 11:39 am Posted by : ramakrishna

గుజరాత్ లో కుప్ప కూలిన వంతెన

మహిసాగర్ నదిలో పడిపోయిన వాహనాలు

ఈ ఘటనలో ముగ్గురు మృతి

వెబ్ న్యూస్, బతుకమ్మ : వంతెన కుప్పకూలడంతో దానిపై ఉన్న వాహనాలు నదిలో పడిపోయిన ఘటన గుజరాత్లోని వడోదరలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా గంభీర బ్రిడ్జీ ఉంది. పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన లోని కొంత భాగం ఒక్కసారిగా కుప్ప కూలింది. దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు ఆ వాహనాల నుంచి ఇప్పటివరకు 10 మందిని రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించినట్లు అధికారులు తెలిపారు. చాలా కాలంగా శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Bridge collapses in Gujarat

డబుల్ ఇంజిన్ మోడల్ మరోసారి బట్టబయలు : కేటీఆర్

గుజ‌రాత్‌లో కుప్పకూలిన వంతెన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గుజరాత్‌లో గంభీర్ వంతెన కూల‌డంతో.. బీజేపీ డబుల్ ఇంజిన్ మోడల్ మరోసారి బట్టబయలు అయింద‌న్నారు. గుజరాత్‌లో, డబుల్ ఇంజిన్ ఉన్న బీహార్, మధ్యప్రదేశ్‌లలో వంతెనలు వరుసగా ఎందుకు కూలుతున్నాయి? వీటిపై ఎన్‌డీఎస్ఏ లేదా ఇతర భద్రతా సంస్థలు విచారణ జరుపుతాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు.  మీరు గొప్పలు చెప్పుకునే గుజరాత్ ‘మోడల్ ఇదేనా’? ప్రజల ప్రాణాలు తీసే నిర్లక్ష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలి! అని డిమాండ్ చేశారు. గాయ‌ప‌డ్డ వారు త్వర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ..  కేటీఆర్ ట్వీట్ చేశారు.

Bridge collapses in Gujarat