Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 8:30 pm Posted by : ramakrishna

తల్లి పాలు శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో కీలకం

 

. . . గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

తల్లిపాలు శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెంపొందించడానికి ఎంతో కీలకమని గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏర్గట్ల మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమని తెలిపారు. తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ గంగ హంస మాట్లాడుతూ, ముర్రుపాలు శిశువుకు జీవితాంతం వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయని వివరించారు. ఆరు నెలల తర్వాత శిశువుకు అనుబంధ పోషకాహారం అందించడం ప్రారంభించాలని సూచించారు. ప్రతి నెలా పిల్లల బరువు, ఎత్తు కొలిచి వారి పోషకాహార స్థితిని పర్యవేక్షించాలని మహిళలకు సూచించారు. అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ప్రతిరోజూ అందించే సంపూర్ణ భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లల బరువును ప్రతి నెల తప్పనిసరిగా తూకం వేయించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సూచించిన మేరకు పిల్లలకు నిర్ణీత సమయంలో అన్ని టీకాలు వేయించడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, శోభ, సుజాత, ఏర్గట్ల గ్రామ మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.