- ఎవరికి వారుగా విడిపోయిన పీడీఎస్ మాఫియా
- పోలీసులకు ఇచ్చే మామూళ్ళ విషయంలోనే గొడవలు
- రెండు రోజుల్లో 10 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
- పోలీసులకు లీకులు ఇస్తున్న దళారులు
నిజామాబాద్, బతుకమ్మ-
నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యం సేకరణ, రీసైక్లింగ్, పొరుగు రాష్ట్రాలకు తరలింపు కోసం ఏర్పడిన పీడీఎస్ మాఫియాలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. గత కొన్ని రోజులుగా అశోక్ నగర్ ను అడ్డాగా చేసుకుని నలుగురు , ఐదుగురు వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి పీడీఎస్ మాఫియాను నడుపుతున్న విషయం తెల్సిందే. ఇటీవల పోలీసులకు ప్రతినెల ఇచ్చే మామూళ్ళ విషయంలో పీడీఎస్ నిర్వాహుకుల వద్ద గొడవ జరిగినట్లు సమాచారం. కేవలం నగరంతో పాటు సరిహద్దు ప్రాంతాల పోలీస్ స్టేషన్ ల అధికారుల కోసం ప్రతి నెల 5 లక్షల మామూళ్ళు ఇవ్వడం విషయంపై గొడవ జరుగుతున్నాయి. డబ్బులన్నీ అధికారులకే ఇస్తున్నారా, సగం నొక్కుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేగాకుండా మూడు సంవత్సరాల కాలంలో రెండు హత్యలు, పలు హత్యాయత్నం కేసులు, గడిచిన నెలలో కిడ్నాప్ కేసు కూడా పీడీఎస్ మాఫియా నిర్వాహకులపై నమోదయింది. ఈ నేపథ్యంలో సిండికేట్ మెయింటెనెన్స్ విషయంలో ఇద్దరు అన్నదమ్ముల పెత్తనాన్ని మిగిలిన వారు సహించలేకపోతున్నారు. వారి వ్యక్తిగత కేసుల విషయంలోనూ తమను బలి చేస్తున్నారని మిగితా వారి మధ్య విభేదాలు పొడ చూపాయి. ఒకప్పుడు పోలీసులకు ఇన్ ఫార్మర్ గా వ్యవహరించి నటరాజ్ టాకీస్ వద్ద ఇడ్లీ సెంటర్ నిర్వహిస్తున్న మధ్యవర్తి డబ్బులు పంపిణీ విషయంలో తమను మోసం చేశాడన్నా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో టాస్క్ ఫోర్స్ లో పని చేసిన ఒక ఏఎస్సై తనకు తెలిసిన అధికారి ఉన్నత స్థానంలో ఉన్నాడని ఆయనే అన్నీ చూసుకుంటాడని పీడీఎస్ మాఫియాను దగ్గరుండి సదరు అధికారికి కల్పించిన విషయం తెల్సిందే. నిజామాబాద్ నగరంలో ప్రతి నెల 1వ తేది నుంచి 17వ తేది వరకు పీడీఎస్ బియ్యం రోజు టన్నుల కొద్ది రైసుమిల్లులకు రీసైక్లింగ్ కోసం లేదా పొరుగు రాష్ట్రానికి సరఫరా కోసం తరలించడం ఆనవాయితీగా మారింది. అశోక్ నగర్ లోని బొందలగడ్డ ప్రక్కన గల సిండికేట్ గోదాము నుంచే నిత్యం నాలుగైదు డీసీఎంలు లేదా బోలేరాల ద్వారా నిత్యం పీడీఎస్ బియ్యం తరలిపోతుండే. పీడీఎస్ బియ్యంను ప్రజల వద్ద రూ.10 నుంచి 15కు కిలో చొప్పున కొనుగోలు చేసి మిల్లర్లకు, పొరుగు రాష్ట్రాల వారికి రూ.25 కిలో చొప్పున అమ్మడం పీడీఎస్ మాఫియా పని. గతంలో పని చేసిన పోలీసు అధికారులు, టాస్క్ ఫోర్స్, రెవెన్యూ ఎన్ ఫోర్స్ మెంట్, స్థానిక పోలీసుల అండదండలతో పీడీఎస్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. ఇటీవల పీడీఎస్ సిండికేట్ లో గొడవలు జరుగడంతో పీడీఎస్ మాఫియాలో లీకులు మొదలయ్యాయి. అది ఎలా అనగా మొన్నటి వరకు సిండికేట్ లో నంబర్ వన్ గా ఉన్న వ్యక్తికి సంబంధించిన రెండు టన్నుల పీడీఎస్ బియ్యంను స్థానిక 1వ టౌన్ పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. ఇది జరిగిన గంటల వ్యవధిలో బోధన్ పట్టణంలోని ఆటోనగర్ వద్ద 4 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. అక్కడ రేషన్ బియ్యం దొరికిన మరికొన్ని గంటల్లోనే సోమవారం 5వ టౌన్ పోలీసులు అజాంకాలనీలో 3 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మూడు ఘటనల్లో దొరికిన బియ్యం అంతా సిండికేట్ ప్రముఖలదే కావడంతో లీకులపై అనుమానాలు పెరిగాయి. సిండికేట్ లో ఉన్నప్పుడు గుట్టుచప్పుడు కాకుండా జరిగిన దందా బహిర్గతం వెనుక సిండికేట్ లీకు వీరులు ఉన్నారనేది అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పీడీఎస్ దందా నిర్వాహకులు ఇప్పటికే కొందరు దళారులను రంగంలోకి దించి 24 గంటల వ్యవధిలో మూడు చోట్ల పట్టుబడిన రేషన్ బియ్యం దందా గుట్టురట్టు చేసిన వారి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పట్టుబడిన గంటల్లోనే పైరవీకారులను రంగంలోకి దింపి కేసులుగట్రా వద్దని బ్రతిమాలనట్లు తెలిసింది. మొత్తం మీద సిండికేట్ మాఫియా ముక్కలు కాగా ఇప్పుడు ఇదే వ్యవహరంతో ముడుపుల వ్యవహరం కూడా బయటకు పొక్కుతుంది. పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరిస్తే పీడీఎస్ దందా ఉండకుండాపోయే అవకాశాలున్నాయి.