Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 8:16 pm Posted by : ramakrishna

కాసుకో కేసీఆర్ నీ దొంగ సర్వేలు ఓడిస్తాం

 

. . . కేసీఆర్ ను ఓడించేందుకు 18 గంటలు పని చేస్తాం

 

. . . 117 సీట్లతో రెండవసారి అధికారంలోకి వస్తాం

 

. . . ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి

 

ఖమ్మం, బతుకమ్మ :

 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుస్తామని కేసీఆర్ దొంగ సర్వేలను బయటకు వదులుతున్నాడని కాస్కో కేసీఆర్ నీ దొంగ సర్వేలు ఓడిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను, అతని బంధువులను దొంగ సర్వేలను ఓడించి తీరుతామన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజల కోసం 18 గంటలు పని చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతుండగా ఎమ్మెల్యే సీట్లు 119 నుంచి 186 వరకు పెరుగుతాయని రాబోయే ఎన్నికల్లో 117 సీట్లతో రెండవసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. హరీష్ రావు బీజేపీ నేతలతో రాత్రి మంతనాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో ప్రధాన సూత్రదారి కేసీఆర్ అయితే దాని వెనుక హరీష్ రావు ఉన్నారని అన్నారు. హరీష్ రావు బీజేపీతో మంతనాలు చేయట్లేదని భద్రచలం రాముడిపై ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. తాటిచెట్టు అంతా పెరిగిన ఆయనకు బుర్రలో గుజ్జు లేదని సీఎం విమర్శలు చేశారు. రైతు భరోసా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1009.15 కోట్ల నిధులను విడుదల చేయడంతో పాటు రైతులకు ఈ – పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రైతులకు వ్యవసాయం పండుగ చేయాలని, రైతులు రాజును చేయాలన్న ఆలోచనతోనే గడిచిన 30 నెలల్లో 1 లక్ష 70 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగంపై ఖర్చు చేశామని చెప్పారు. రైతు భరోసా కింద గత ఏడాది జూన్‌లో 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేశామని గుర్తుచేశారు. 30 నెలల్లో రైతు భరోసా కింద 36,135 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని పెద్దలు చెప్పారని, రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా ఆశయమని అన్నారు. రైతు భరోసా, రుణ మాఫీ, బీమా, గిట్టుబాటు ధరలు, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, నష్టపరిహారం.. ఇలా రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం గడిచిన 30 నెలల్లో 1.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. సగటున ప్రతి నెలా రూ. 5,500 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటికి రాష్ట్రం రూ. 8.11 లక్షల కోట్ల మేరకు అప్పులు ఉండగా, ఎంతో సమయస్ఫూర్తితో రాష్ట్రాన్ని నడిపిస్తూ గత ప్రభుత్వ పథకాలతో పాటు అదనంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను ఉదహరించారు. ఎకరాకు రూ. 12 వేలకు పెంచి రైతు భరోసా అందిస్తున్నామన్నారు. 30 నెలల్లో రూ. 80 వేల కోట్ల మేరకు వడ్లను కొనుగోలు చేశామన్నారు. గత ప్రభుత్వ పథకాలతో పాటు అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు జారీ, సన్నబియ్యం పంపిణీ, 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు అందించడం, బ్యాంకుల లింకేజీతో 60 వేల కోట్ల మేరకు రుణాలు అందించడం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు పండుగ సారెగా ఇందిరమ్మ చీరలు అందించడంతో పాటు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా 67,717  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అనేక అంశాలను వివరించారు. తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా నిలబెడుతామని చెప్పారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల కోసం రూ. 3,504 కోట్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

Brace yourself, KCR—we will defeat your bogus surveys.