Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 8:12 pm Posted by : ramakrishna

 బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

 

. . . 24 గంటల్లోనే చేదించిన పోలీసులు

. . . చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత

. . . బాలుడిని ఎత్తుకెళ్లిన దంపతుల అరెస్టు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం ప్రాంగణంలో జరిగిన చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మూడు సంవత్సరాల బాలుడికి చాక్లెట్ ఆశచూపి ఎత్తుకెళ్లిన మహిళను, ఆమెకు సహకరించిన వ్యక్తిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం ఎంసీహెచ్ కు వచ్చింది. తన ఇద్దరు పిల్లలను కుటుంబ సభ్యులు ఎంసీహెచ్ ప్రాంగణంలో ఉంచగా కాన్పు కోసం మహిళను లేబర్ రూంకు తరలించారు. బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులలో చిన్న వాడైనా వేదాన్ష్(3) ను రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నివాసులు అయిన  కోతాడి సుజాత, కోతాడి ఎల్లం అనే వ్యక్తులు చాక్లెట్ ఆశచూపి ఎత్తుకెళ్లారు. తన తమ్ముడిని మహిళ చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్లిందని అతని సోదరుడు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అప్రత్తమై 112 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. నిజామాబాద్ 1వ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీపీ  ఆదేశాలతో సీసీఎస్, టెక్నికల్ టీంలు రంగంలోకి దిగి ఎంసీహెచ్ లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా మహిళ వేదాన్ష్ ను తీసుకెళ్తున్న వీడియోలు స్పష్టంగా కనిపించాయి. వీడియోల ఆధారంగా రాష్ట్రపతి రోడ్డు, బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో పరిశీలించారు. మహిళ చిన్నారిని తీసుకెళ్తున్న ద`శ్యాల ఆధారంగా సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్ గ్రామంలో బాలుడిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా ఐదు సంవత్సరాల్లోపు పిల్లలను ఆరుబయట ఆడుకునేటప్పుడు, ఆసుపత్రులు, స్కూళ్ళ వద్ద, ప్రయాణ ప్రాంగణాల్లో జాగ్రత్త వహించాలని సూచించారు. 24 గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసును చేదించిన 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలోని టీం చాకచక్యంగా వ్యవహరించి సుఖాంతం చేసిందని వారిని సీపీ అభినందించారు.

Boy's kidnapping story has a happy ending.
Boy’s kidnapping story has a happy ending.